గ్వాటెమాల దేశంలో ప్రజల ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి. దేశాధ్యక్షుడు అలెజాండ్రో గణమట్టేయ్, అటార్నీ జనరల్ మరియా పోర్రాస్ రాజీనామా చేయాలని రాజధాని గ్వాటెమాల సిటీ లో లక్షలమంది నిరసన తెలుపుతున్నారు. దేశంలో అవినీతి పెరిగిందని, ప్రభుత్వ పెద్దలే ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ప్రదర్శనకారులు విమర్శిస్తున్నారు. దేశంలోని అన్ని నగరాల్లో దేశాధ్యక్షుడు అలెజాండ్రో కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఫ్రాన్సిస్కో సందోవాల్ ను స్పెషల్ ప్రాసిక్యూటర్ పదవి నుంచి తొలగించటం వివాదాస్పదమైంది. దేశాధ్యక్షుడు అలెజాండ్రో పై వచ్చిన అవినీతి ఆరోపణలని ఫ్రాన్సిస్కో విచారిస్తున్నారు. అలెజాండ్రో అవినీతి బయట పడుతుందనే కుట్ర చేశారని ప్రజాసంఘాలు ఆరోపించాయి. పోయిన నవంబర్ లో కూడా ప్రభుత్వం అవినీతి మయమైందని దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు మిన్నుముట్టాయి. పార్లమెంటు భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు అప్పుడు భవనానికి నిప్పు పెట్టారు.
గ్వాటెమాల పరిణామాలు ఇలాగే కొనసాగితే అంతర్యుద్దం వైపు దారి తీసే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాలకు మధ్య ఉండే ఈ దేశంలో రాజకీయ సుస్థిరత కోసం అమెరికా జోక్యం చేసుకోవాల్సిన అవసరముంది.