టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఇంగ్లాండ్ లీగ్ లో తన సత్తా చూపుతున్నాడు. అదికూడా టెస్టుల్లో కాదు వన్డే మ్యాచ్ ల్లో. పుజారా రెండేళ్లుగా ఫామ్ లేమితో బాధపడుతూ టీమిండియా టెస్ట్ జట్టులో స్థానం నిలబెట్టుకుంటాడా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన ఏకైక టెస్టులో కూడా రాణించలేక చతికిలపడ్డాడు. సంవత్సరకాలంగా ఇంటా బైటా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పుజారాతో పాటు అజింక్యా రేహానే కూడా ఇటీవల విఫలమవుతూ వస్తున్నాడు. వీరిద్దరినీ రంజీ ట్రోఫీ ఆడాల్సిందిగా కూడా హెడ్ కోచ్ ద్రావిడ్ గతంలో సూచించాడు.
అయితే ఆగష్టు 2 నుంచి సెప్టెంబర్ 17 వరకూ ఇంగ్లాండ్ లో జరుగుతోన్న రాయల్ లండన్ వన్డే కప్ -2022లో ససెక్స్ టీమ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడి వరుసగా 9, 63, 14, 107, 174 పరుగులు చేశాడు. నిన్న ఆగష్టు 14 న జరిగిన మ్యాచ్ లో 131 బంతుల్లో 20 ఫోర్లు, 5 సిక్సర్లతో 174 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో ససెక్స్ ఏకంగా 216 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఐదు మ్యాచ్ ల్లో మూడు విజయాలతో పాయింట్ల పట్టికలో ససెక్స్ మూడో స్థానంలో ఉంది. ఒక్కో గ్రూప్ లో తొమ్మిది జట్లు చొప్పున రెండో జట్లలో కలిపి మొత్తం 18 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. ఒక్కో టీమ్ తన జట్టులోని మిగిలిన ఎనిమిది జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. లీగ్ మ్యాచ్ లు పూర్తయ్యే నాటికి రెండు గ్రూప్ ల్లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సెమీ ఫైనల్స్ కు చేరతాయి. ఈ టోర్నీలో ఇప్పటి వరకూ అత్యధిక పరుగులు సాధించిన వారిలో పుజారా రెండో స్థానంలో ఉన్నాడు. ఐదు మ్యాచ్ లలో కలిపి 120.72 స్ట్రయిక్ రేట్ తో 367 పరుగులు చేశాడు. వీటిలో 33 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి.
ఇండియా టెస్టు జట్టులో అంతగా రాణించలేకపోయినా ఇంగ్లీష్ లీగ్ మ్యాచ్ ల్లో జోరుమీదున్న పుజారా ఇదే ఊపుతో రాబోయే కాలంలో టీమిండియా తరఫున కూడా ఇదే ఆటతీరు ప్రదర్శించాలని ఆశిద్దాం.