Tough to RCB: ప్లే ఆఫ్ కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బెంగుళూరు రాయల్ ఛాలంజర్స్ (ఆర్సీబీ) ఓటమి పాలైంది. నేడు జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 54 పరుగుల తేడాతో బెంగుళూరుపై ఘన విజయం సాధించింది. పంజాబ్ విసిరిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులు మాత్రమే చేసింది. లియామ్ లివింగ్ 70; బెయిర్ స్టో 66 పరుగులతో రాణించి పంజాబ్ భారీ స్కోరు చేయడంలో తోడ్పడ్డారు.

ముంబై బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేసింది. ఓపెనర్ ధావన్-21 పరుగులు చేసి ఔటయ్యాడు. భానుక రాజపక్ష కేవలం ఒక పరుగు మాత్రమే చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన లియామ్ లివింగ్ స్టోన్ 42 బంతుల్లో 5ఫోర్లు, 4 సిక్సర్లతో 70; ఓపెనర్ జానీ బెయిర్ స్టో 29 బంతుల్లో 4 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 66 పరుగులు చేసి సత్తా చాటారు. శిఖర్ ధావన్-21; కెప్టెన్ మయాంక్ అగర్వాల్-19 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 209 పరుగులు చేసింది.  బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు; వానిందు హసరంగ రెండు; మాక్స్ వెల్, షాబాజ్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.

బెంగుళూరు 40 పరుగులకే మూడు కీలక వికెట్లు (విరాట్ కోహ్లీ-20; డూప్లెసిస్-10; లామ్రోర్-6) కోల్పోయింది. రజత్ పటిదార్- గ్లెన్ మాక్స్ వెల్ లు నాలుగో వికెట్ కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 104 పరుగుల వద్ద ఇద్దరూ ఔటయ్యారు. మాక్స్ వెల్-35; రజత్ -26 పరుగులు చేశారు. హార్డ్ హిట్టర్ దినేష్ కార్తీక్ కేవలం 11 పరుగులే  చేయగా, హర్షల్  పటేల్-11; షాబాజ్ అహ్మద్-9 స్కోరు చేసి పెవిలియన్ చేరారు.

పంజాబ్ బౌలర్లలో రబడ మూడు; రిషి ధావన్, రాహుల్ చాహర్ చెరో రెండు; హర్ ప్రీత్ బ్రార్, ఆర్ష్ దీప్ సింగ్ చెరో వికెట్ పడగొట్టారు.

జానీ బెయిర్ స్టో కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : చెన్నైను ఓడించిన ముంబై

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *