Thursday, January 23, 2025
Homeస్పోర్ట్స్IPL-Arshdeep Singh: హోరాహోరీ పోరులో పంజాబ్ దే విజయం

IPL-Arshdeep Singh: హోరాహోరీ పోరులో పంజాబ్ దే విజయం

ఐపీఎల్ లో నేడు మరో ఆసక్తికరమైన మ్యాచ్ జరిగింది. ముంబై ఇండియన్స్ పై పంజాబ్ కింగ్స్ 13 పరుగులతో విజయం సాధించింది. పంజాబ్ ఇచ్చిన 215 పరుగుల లక్ష్యానికి ముంబై ధీటుగా జవాబిచ్చినా  అర్ష్ దీప్ తన రెండు డెత్ ఓవర్లను అద్భుతంగా బౌల్ చేసి మూడు వికెట్లు తీసి పంజాబ్ కు విజయం ఖాయం చేశాడు.

వాంఖేడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పంజాబ్ 83 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. మాథ్యూ షార్ట్-11; ప్రభ్ సిమ్రాన్-26; అథర్వ తైడే-29; లియామ్ లివింగ్ స్టోన్-10 పరుగులు చేసి ఔటయ్యారు. ఈ దశలో కెప్టెన్ శామ్ కర్రన్ –హర్ ప్రీత్ సింగ్ లు ఐదో వికెట్ కు 92 పరుగులు జోడించారు. హర్ ప్రీత్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో  41;  29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు సాధించారు. ఈ దశలో క్రీజులోకి  వచ్చిన జితేష్ శర్మ విశ్వరూపం చూపించాడు. కేవలం ఏడు బంతుల్లో నాలుగు సిక్సర్లతో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ముగ్గురి ధాటికి పంజాబ్ చివరి ఆరు ఓవర్లలో 109 రన్స్ రాబట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో కామెరున్ గ్రీన్, పియూష్ చావ్లా చెరో రెండు; అర్జున్ టెండూల్కర్, బెహెండ్రాఫ్, జోఫ్రా ఆర్చర్ తలా ఒక వికెట్ సాధించారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 8 పరుగుల వద్ద ఓపెనర్ ఇషాన్ కిషన్ (1) వికెట్ కోల్పోయింది. కెప్టెన్ రోహిత్- గ్రీన్ లు రెండో వికెట్ కు 76 పరుగులు జోడించారు. రోహిత్ 27బంతుల్లో  4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 రన్స్ సాధించి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. గ్రీన్ 43 బంతుల్లో 6 ఫోర్లు 3 సిక్సర్లతో 67; సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 7 ఫోర్లు 3 సిక్సర్లతో 57 పరుగులతో స్కోరు బోర్డును ఉరకలెత్తించారు. కానీ 18వ ఓవర్లో అర్ష్ దీప్ బౌలింగ్ లో సూర్య ఔటయ్యాడు. చివరి రెండు ఓవర్లకు 31 పరుగులు కావాల్సిన దశలో 19వ ఓవర్లో టిమ్ డేవిడ్ 13- తిలక్ వర్మ2.. మొత్తం 15 పరుగులు రాబట్టారు. అయితే అర్ష్ దీప్ వేసిన చివరి ఓవర్ లో మొదటి బంతికి కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది, రెండో బంతి డాట్ బాల్, మూడో బంతికి తిలక్, నాలుగో బంతికి నేహాల్ వాడేరా వికెట్లను కూల్చడంతో పంజాబ్ విజయం ఖాయమైంది. టిమ్25 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ముంబై 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది.

పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 4; నాథన్ ఎల్లిస్, లివింగ్ స్టోన్ చెరో వికెట్ సాధించారు.

శామ్ కర్రన్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్