పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ఈ నెల 16వ తేదిన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. స్వతంత్ర సమరయోదుడు భగత్ సింగ్ పుట్టిన స్వగ్రామం ఖట్కర్ కలాన్ లో భగవంత్ మాన్ తో పాటు ఆయన మంత్రివర్గం ప్రమాణం చేయనుంది. ఖట్కర్ కలాన్ నవాన్ షహర్ జిల్లాలో ఉంది. రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో ఉంచకూడదని మరో కీలక నిర్ణయం ఆప్ నేత ఇప్పటికే తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కేవలం భగత్ సింగ్, అంబేద్కర్ ఫోటోలను మాత్రమే ఏర్పాటు చేయనున్నట్లు భగవంత్ మాన్ వెల్లడించారు.
మంత్రి వర్గ కూర్పు పై ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో భగవంత్ మాన్ ఈ రోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. మరికొద్ది సేపట్లో చండీగఢ్ లో ఆప్ లెజిస్లే టివ్ పార్టీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో భగవంత్ మాన్ ను తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపై భగవంత్ మాన్ రేపు గవర్నర్ ను కలవనున్నారు. ఎల్లుండి మార్చి 13న అమృత్ సర్ లో కేజ్రీవాల్ తో కలిసి భగవంత్ మాన్ భారీ రోడ్డు షో నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి పదవికి చరణ్ జిత్ సింగ్ చన్ని ఈ రోజు రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ భన్వరి లాల్ పురోహిత్ కు రాజీనామా లేఖ అందచేశారు.