Yesudas.. Sign of dedication: జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా ఒక ఆశయం ఉండాలి .. దానిని సాధించాలనే తపన ఉండాలి .. అందుకోసం అహర్నిశలు అంకితభావంతో కృషి చేయాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పట్టుదల వదలకూడదు. మిన్ను విరిగి మీదపడుతున్నా చలించకూడదు. గండాలను దాటుకుంటూ గమ్యం వైపు సాగిపోవలసిందే. అవమానాలనే ఆటంకాలను అధిగమిస్తూ లక్ష్యాన్ని చేరుకోవలసిందే. పోరాటమనేది లేకుండా విజయం లభించదు .. ఓరిమితో ఓటమిని ఎదిరించగలిగితేనే గాని విజేతగా నిలబడలేరు.
అంకితభావంతో అడుగులువేసే వారిని అవాంతరాలు ఏమీ చేయలేవు. పట్టుదలతో పరుగుతీసేవారిని అలుపనేది గెలుపుకు దూరం చేయలేదు. తాను అనుకున్న మార్గంలో .. తాను అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి అవసరమైన కసి .. కృషి ఉన్నవారు మాత్రమే కోటికొక్కరుగా మిగులుతారు .. జన ప్రవాహం చేత జేజేలు అందుకోగలుగుతారు. అలాంటి మహానుభావులలో .. మహా గాయకులలో .. కేజే ఏసుదాసు ఒకరుగా కనిపిస్తారు. ఆయన 1940 జనవరి 10వ తేదీన కేరళ – కొచ్చిలో జన్మించారు.
ఏసుదాసు పూర్తి పేరు కట్టస్సేరి జోసెఫ్ ఏసుదాసు. ఆయన ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రికి కర్ణాటక సంగీతంలో మంచి ప్రవేశం ఉండేది. అందువలన ఆయన చిన్నప్పటి నుంచే ఏసుదాసుకి సంగీతం నేర్పుతూ వెళ్లారు. ఏసుదాసుకి వయసుతో పాటు సంగీతం పట్ల ఆసక్తి కూడా పెరుగుతూ పోయింది. ఒకానొక దశలో తండ్రి చనిపోవడంతో, ఆ కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా ఏసుదాసు తన నిరంతర సాధనను .. అభ్యాసనను పక్కన పెట్టలేదు.
సంగీత కళాశాలలో విద్యను అభ్యసించడమే కాకుండా, కొంతమంది సంగీత విద్వాంసుల దగ్గర శిష్యరికం చేస్తూ ఆయన ముందుకు వెళ్లారు. సంగీతంలో అనేక మెళకువలను నేర్చుకుంటూ ముందుకు సాగారు. సంగీతం నేర్చుకోవాలనే ఆయనలోని తపనను గ్రహించిన గురువులు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని ఆశ్రయం కల్పించారు .. మనస్ఫూర్తిగా ప్రోత్సహించారు. అలా ఏసుదాసు సంగీత ప్రవాహంలో చాలా దూరం ప్రయాణించారు. ఆ తరువాత ఆయన గాయకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మద్రాసులో అడుగుపెట్టారు.
అవకాశాల కోసం ఏసుదాసు అదే పనిగా తిరగడం మొదలుపెట్టారు. అయితే ఎవరూ కూడా అవకాశం ఇవ్వకపోగా, అసలు ఆయన వాయిస్ సినిమా పాటలకి పనిరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. అలా ఎవరరు ఎన్ని రకాలుగా అవమానించినా తనపై .. తన స్వరంపై ఉన్న నమ్మకం అణుమాత్రమైనా సడలలేదు. చివరికి ఆయన స్వరంలో ఏదో ప్రత్యేకత ఉంది .. మనసులను కట్టిపడేసే మహత్తు ఉందనే విషయాన్ని గ్రహించిన కారణంగా, 1962లో మలయాళ సినిమా ‘కాలపదుకై’లో పాడే అవకాశం లభించింది.
ఇక అప్పటి నుంచి గాయకుడిగా ఏసుదాసు వెనుదిరిగి చూసుకోలేదు. తనని తాను మార్చుకుంటూ .. తనని తాను తీర్చుకుంటూ ఆయన ముందుకు వెళ్లారు. మలయాళంతో పాటు తమిళ .. కన్నడ .. తెలుగు .. హిందీ .. బెంగాలీ .. ఒరియా .. ఇలా వివిధ బాషలలో పాడుతూ సాగారు. ఆయా భాషలలోని అగ్రకథానాయకులు తమ పాటలను ఆయనతో పాడించడానికి పోటీపడ్డారు .. ఆయన పాడేవరకూ నిరీక్షించారు. ఒకే రోజున వివిధ భాషలకి చెందిన 16 పాటలను పాడిన రికార్డు ఆయన ఖాతాలో ఉంది.
తెలుగులో కూడా ఆయన ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటీ (అంతులేని కథ) చుక్కల్లే తోచావే (నిరీక్షణ) ఆకాశదేశాన (మేఘసందేశం) స్వరరాగ గంగాప్రవాహమే (సరిగమలు)ఇదేలే తరతరాల చరితం (పెద్దరికం) ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు (అల్లుడు గారు) అందమైన వెన్నెలలోన (అసెంబ్లీ రౌడీ) మూసి మూసి నవ్వుల లోన (బ్రహ్మ) ఇలా ఎన్నో సుమధుర గీతాలు ఆయన స్వరం నుంచి జాలువారాయి. తెలుగులో మోహన్ బాబు సినిమాలకి ఆయన ఎక్కువగా పాడారు. ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం.
ఒక వైపున సినిమా పాటలను .. మరో వైపున భక్తి గీతాలను ఆయన ఆలపించారు. ఘంటసాలవారి భగవద్గీత .. బాలు లింగాష్టకం మాదిరిగా ఏసుదాసు ‘హరివరాసనం’ ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. ఇప్పటికీ శబరిమలలో ఇదే స్వామివారికి పవళింపు సేవ పాటగా వినిపిస్తారు. దేశవిదేశాల్లో ఆయన అనేక కచ్చేరీలు చేశారు. దశ దిశలా స్వర విహారం చేసిన ఆయనను అనేక అవార్డులు పలకరించాయి .. మరెన్నో పురస్కారాలు వరించాయి. పద్మశ్రీ .. పద్మభూషణ్ .. పద్మవిభూషణ్ … ఆయన ప్రతిభకు కొలమానంగా నిలిచాయి. పాటకి పట్టాభిషేకం చేసిన ఆ గానగంధర్వుడి జన్మదినోత్సవం నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
(ఏసుదాసు జన్మదిన ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read : అలనాటి జగదేక సుందరి.. సరోజా దేవి