Puspaka Vimanam Movie :
ఆ మధ్య ‘పుష్పక విమానం‘ అని ఒక సినిమా చూడవలసి వచ్చింది. అందులో కథ చాలా సరదాగా సాగినట్టు అనిపిస్తుంది. కానీ, ఒక చాలా తీవ్రమైన జీవితపాఠాన్ని దర్శకుడు అందులో నిగూఢంగా (చెప్పకనే) చెప్పాడు. ‘పెళ్లికి పునాది నమ్మకం’ అని చాలా గొప్ప సందేశమే ఇచ్చాడు. జీవితకాలం పాటు నిలబడవలసిన ఆ నమ్మకం వారి మధ్య ఎలా ఏర్పడుతుంది? ఇదీ అసలు, సిసలైన ప్రశ్న.
‘పెళ్లంటే..?’ అన్న ప్రశ్నతోనే ఆ సినిమా మొదలై, (ఆసక్తికరమైన అనేక మలుపులతో) చివరకు అదే ప్రశ్నతో ముగుస్తుంది. అసలు విషయం (సినిమా కథ) లోకి వెళితే, ఆ ఇద్దరూ (హీరో హీరోయిన్ లు) ‘ఇష్టపడే’ పెళ్లి చేసుకుంటారు. కానీ, చిత్రంగా (సరికొత్తగా) శోభనం రోజే, ఆ పెళ్లికొడుకు “నువ్వు వర్జిన్ వేనా?” ( కన్యత్వం చెడకుండా అంటే, ఇప్పటికే నీకు మరే పురుషునితోనూ శారీరక సంబంధం లేదా?) అని తాను అప్పుడే సంప్రదాయ బద్ధంగా పెండ్లాడిన పెళ్లికూతురును ‘అడగకూడని’ (అనవసరమైన) ప్రశ్న అడుగుతాడు. దీంతో కథ సినిమాకు కావలసిన అసలు మలుపు తిరుగుతుంది.
ఆమె కోపం పట్టలేక తెల్లవారే మరొకరి (తన మాజీ ప్రేమికుడి)తో వెళ్లిపోతుంది. తర్వాత హీరో ఎన్ని ప్రయాసలు పడ్డా ఆమెను కనుక్కోలేక పోవడం, చివరకు ఆమె హత్యకు గురవడం, దానికి దారితీసిన పరిస్థితులూ.. అన్నీ సినిమాటిక్ అంశాలు. ముగింపులో ఆ హీరో మరో అమ్మాయిని ‘ఇష్టపడి’ మళ్లీ పెళ్ళికి సిద్ధపడటం క్లైమాక్స్. అదే మొట్టమొదటి ప్రశ్న (పెళ్లంటే?) తో చిత్రం ముగుస్తుంది.
కాగా, ఈ ప్రశ్నకు జవాబును మాత్రం (రెండు సమయాల్లోనూ) దర్శకుడు ప్రేక్షకుల ఆలోచనకే వదిలేస్తాడు. మొత్తం మీద పెళ్లికి ప్రేమ ఒక్కటి వుంటే సరిపోదని, ఒకరిపట్ల ఒకరికి నమ్మకం వుండాలని అంతర్లీనంగా సందేశమిస్తాడు. అది లేకపోతే అదొక ‘పుష్పక విమానం’ వంటిదే అని తెలియ చెప్పాడు.
మన పెద్దలు పెళ్లంటే, ‘ఇద్దరు స్త్రీ పురుషుల ఆదర్శవంతమైన దాంపత్యం’ అని అర్థం చెప్పారు. అలాగని, ‘ప్రేమ లేకుండానే పెళ్లి’ అన్నట్టుగా ఆధునికులు కొందరు పెడార్థం తీశారు. భారతీయ సనాతన ధర్మం ‘పెళ్లంటే పరస్పర ప్రేమతో కూడిన ఒక పవిత్రబంధం’ అన్నది. ఎందుకంటే, సత్సంతానం, ఉదాత్త సమాజ స్థాపనే వారి లక్ష్యం. అందుకే, మన పెద్దలు పెళ్లికి ఒక యజ్ఞరూపాన్నిచ్చారు. పెళ్లిపట్ల ఒక అవ్యాజ పవిత్రభావన వుంటే తప్ప అది జీవిత పర్యంతం వారిని ఒక్క తాటిపై నిలబెట్టే గొప్ప నమ్మకంగా మనలేదన్నది వారి ఉద్దేశ్యం. కాగా, కొందరు సంప్రదాయేతరులు పని కట్టుకుని దీనికి వక్రభాష్యం చెప్పిన దుష్ఫలితాన్ని నేటి సమాజం అనుభవిస్తున్నది.
‘పెళ్లంటే ప్రేమ మాత్రమే అని, అదొక్కటి వుంటే చాలని, వంశప్రతిష్ట, గౌరవ మర్యాదలు, సభ్య సమాజమూ, పవిత్ర భావన ఇవేవీ దానికి ముఖ్యం కావని, చివరకు కుటుంబాలతో కూడా దానికి పని లేదని విశృంక రీతిలో కొందరు పురుష స్త్రీవాదులు కొత్తర్థం తీశారు. దీంతో, అసలే స్వేచ్చ మీరిన ఆధునిక యువత మరింత విచ్చలవిడి అయింది. పర్యవసానం ఒకరి నొకరు నువ్వు ‘వర్జిన్ వేనా?’ అని పెళ్లికి ముందు, తర్వాత అనుమానించే పరిస్థితులు ఏర్పడ్డాయి.
– దోర్బల బాలశేఖరశర్మ
Also Read : ‘బంగార్రాజు’ .. భారీ వసూళ్లు!