Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రజాస్వామ్యానికి రాచరిక కిరీటం

ప్రజాస్వామ్యానికి రాచరిక కిరీటం

Respect for Dynasty: బ్రిటన్ రాణి మరణం నేపథ్యంలో సంతాపాలు, అంత్యక్రియల్లో రాచ మర్యాదలు, సంప్రదాయాల మీద అంతర్జాతీయంగా చాలా చర్చ జరుగుతోంది. జరగడం చాలా అవసరం కూడా.

ఆ దేశం పేరే యునైటెడ్ కింగ్ డమ్ . ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్దర్న్ ఐలాండ్స్ కలిపి గ్రేట్ బ్రిటన్ లేదా యునైటెడ్ కింగ్ డమ్. ప్రజాస్వామ్యం ఎంత బలంగా ఉందో…అంతే బలంగా రాచరికం కూడా ఉండడం బ్రిటన్ వైచిత్రి. పేరులో కింగ్ డం ఉన్నన్నాళ్ళు బ్రిటన్ లో రాజు/రాణి ఉంటారు.

కోవిడ్ ఆంక్షల వేళ ఒక మందు పార్టీ ఇచ్చి నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్రిటన్ ప్రధాని పదవీచ్యుతుడు కావాల్సి వచ్చింది. అంత సున్నితమయిన అలిఖిత ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పాటించే బ్రిటన్ లో రాచరికం ఎందుకంతగా నెత్తిన పెట్టుకుని పూజించదగ్గది అయ్యిందో వివరిస్తూ వివిధ కోణాల్లో విశ్లేషణలు జరుగుతున్నాయి.

ఈ విషయమ్మీద తెలుగులో సాక్షిలో ఒకే రోజు రంగనాయకమ్మ, కరణ్ థాపర్ వ్యాసాలు అచ్చయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియాలో స్వపన్ దాస్ గుప్త వ్యాసం వచ్చింది. ఇండియా టుడే టీవీ లో రాజదీప్, ఎన్ డి టీ వీ లో సంకేత్ ఉపాధ్యాయ్ చర్చా కార్యక్రమం నిర్వహించారు. సారాంశం ఇది:-

⦿ చింత చచ్చినా పులుపు చావనట్లు…ప్రపంచవ్యాప్తంగా ఎక్కడయినా రాచరికం అంతరించినా…రాజుల కుటుంబాల పట్ల ఆరాధన తగ్గదు.

⦿ బ్రిటన్ లో కార్మిక పోరాటాలు, పేదల ఉద్యమాలు ఎన్ని జరిగినా రాచరికం విలువ తగ్గకుండా కాపాడినవారు సంపన్నులు, మతాధికారులు. మతం విలువ తగ్గకుండా ఉండాలంటే రాజు/రాణి పెత్తనం అవసరం. సంపన్నుల అవసరం కూడా అలాంటిదే.

⦿ రాణి ధరించే బట్టలు, వేసుకునే చెప్పులు, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు…ఇలా వాటి మీద చర్చోపచర్చలు జరగడం కూడా వ్యూహంలో భాగమే కానీ…వాటికవిగా సహజంగా జరిగేవి కావు.

⦿ వెయ్యేళ్ల కిందట గుర్రాలు, ఏనుగులు వాడితే…ఇప్పుడు కూడా అత్యాధునిక జాగ్వార్ కస్టమైజ్డ్ శవ యాత్రా వాహనం ముందు వెనుక అవే గుర్రాలు, అవే కళ్లు కనపడనివ్వని నల్ల బొచ్చు పొడుగు టోపీలు అవసరమా?

⦿ ప్రత్యేకించి భారత ప్రభుత్వం రాణి మృతికి కళ్లల్లో రక్తం కారుస్తూ, ఒక పూట జాతీయ పతాకాన్ని అవనతం చేయడం సమంజసంగా ఉందా?

⦿ ప్రపంచమంతా ఇంగ్లీషు భాషను, వారి సంస్కృతిని విస్తరింపజేసిన, చేస్తున్న కుట్రలు, వ్యూహాల మీద ఇలాంటి సందర్భాల్లో ఎంతో కొంత చర్చ జరగాలి కదా?

⦿ సొంత కోడలు డయానాను మహారాణి ఎలా చూసుకున్నారు? ఆ డయానా కొడుకు- కోడలు అంతఃపురం బంగారు పంజరం కమ్మీలు తెగ్గొట్టుకుని…సామాన్యుల్లా అమెరికాలో ఎందుకు బతుకుతున్నారు?

⦿ బ్రిటన్ అభివృద్ధిలో ఈ రాజుల/రాణుల పాత్ర ఎంత?

⦿ అంతర్జాతీయంగా బ్రిటన్ వలసవాద విస్తరణలో, అరాచకాల్లో రాజుల/రాణుల పాత్ర ఎంత?

⦿ రాజులు/రాణులను భరించడానికి ప్రజాస్వామికంగా ఎన్నికయ్యే బ్రిటన్ ప్రభుత్వానికి ఏటా అయ్యే ఖర్చెంత?

⦿ అంతర్జాతీయ మీడియా ప్రమాణాలకు పెట్టింది పేరైన బి బి సి…బ్రిటన్ రాణి విషయంలో చూపే పక్షపాతమెంత?

ఇలా అనేక ప్రశ్నలకు ఎవరి కోణంలో వారు సమాధానాలిచ్చారు. అవన్నీ ఇక్కడ రాస్తే నిడివి ఎక్కువవుతుంది. ఉత్సాహమున్నవారు ఆయా వ్యాసాలు, టీ వీ చర్చల ద్వారా తెలుసుకోవచ్చు.

కొసమెరుపు:-
రాణి అంత్యక్రియలను “లాస్ట్ వాక్- (అంతిమ యాత్ర)” పేరిట అన్ని అంతర్జాతీయ ఇంగ్లీషు ఛానెల్స్ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. బి బి సి మూడు రోజులు కన్నీరు కార్చడాన్ని అర్థం చేసుకోవచ్చు. రాణి అంత్యక్రియల దృశ్యాలకు అడ్డొస్తుందని బి బి సి తన లోగోను, కింద స్క్రోలింగ్ స్ట్రిప్ ను కూడా తీసేసింది.

బ్రిటన్ రాణి ముందు మనం అనామకులు కావాలి అన్నది ఆదర్శం కాబోలు. అలాంటి రాణి పోయినవేళ బి బి సి అనామకం కావడం కూడా దానికదిగా ఒక సమున్నత గౌరవ ప్రకటన!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్