బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థిని మృతిచెందారు. హాస్టల్ భవనంపై నుంచి పడి విద్యార్థిని మృతి సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనతో బాసర ట్రిపుల్ ఐటీలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతదేహంతో విద్యార్థులు ఆందోళనకు దిగడం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీశాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతురాలి పేరు బూర లిఖిత. బాసర రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీలో పీయూసీ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. సిద్ధిపేట్ జిల్లా గజ్వేల్ ఆమె స్వస్థలం. ఈ తెల్లవారుజామున 2 గంటల సమయంలో హాస్టల్ భవనం నాలుగో అంతస్తు నుంచి కిందపడి మరణించినట్లు చెబుతున్నారు. సెక్యూరిటీ గార్డ్, హాస్టల్ సిబ్బంది లిఖితను హుటాహుటిన భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అనంతరం మెరుగైన చికిత్స కోసం నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లిఖిత మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. లిఖిత మృతిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆమె కాలు జారి కిందపడి మరణించినట్లు వార్తలు వస్తోండగా.. బలవన్మరణానికి పాల్పడిందనే వాదనలు కూడా ఉన్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
బుధవారమే పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూమ్ లో చున్నీతో ఉరేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీపిక మృతి ఘటన మరువక ముందే మరో విద్యార్థిని మృతి చెందడటంతో బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో అసలేం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.