ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘చంద్రముఖి 2′ రెడీ అవుతోంది. లారెన్స్ – కంగనా – మహిమ నంబియార్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై గట్టిగానే అంచనాలు ఉన్నాయి.’చంద్రముఖి’ సినిమాలో గంగను చంద్రముఖి ఆవహించినట్టుగా చూపించారు. కానీ ఈ సినిమాలో నేరుగా ‘చంద్రముఖి’నే రంగంలోకి దిగనుంది. ఇక వేట్టై రాజా పాత్రలో లారెన్స్ కనిపించనున్నాడు. ఆ లుక్ తో కూడిన పోస్టర్ లనే ఎక్కువగా వదులుతూ వచ్చారు.
లారెన్స్ సహజంగానే రజనీ స్టైల్ ను అనుకరిస్తూ ఉంటాడు. తన బాడీలోనే రజనీ స్టైల్ ఉందనీ, ఆయన నుంచి తాను నేర్చుకున్నది ఆ స్టైల్ నే అని లారెన్స్ చెప్పాడు కూడా. అయితే గతంలో రజనీకాంత్ వేట్టై రాజాగా ఒక మార్కును సెట్ చేశాడు. ఆ పాత్రలో ఆయన వాకింగ్ స్టైల్ హైలైట్ గా నిలుస్తుంది. ఇప్పుడు ఆ పాత్రలో లారెన్స్ నడుస్తున్నా, ఆయన రజనీని అనుకరిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. ఒక్క లారెన్స్ అనే కాదు .. ఆ పాత్రను ఎవరు పోషించినా రజనీ ప్రభావం నుంచి బయటపడి చేయడం కష్టమే.
పాత్రకు ఒక ప్రత్యేకతను తీసుకు రావడం .. ఆ పాత్ర ద్వారా ప్రేక్షకులను ప్రభావితం చేయడం రజనీ చేసే మేజిక్స్ లో ఒకటిగా కనిపిస్తుంది. ఇక ఆ తరువాత ఎవరు ఆ తరహా పాత్రను పోషించినా ఆయనే కనిపిస్తాడు. అందువలన లారెన్స్ ఈ సినిమాలో ఎంత గొప్పగా చేసినా, ఆయన రజనీ మార్క్ నుంచి తప్పించుకోవడం .. ఆయన ప్రస్తావన లేకుండా తన నటనకి మార్కులు తెచ్చుకోవడం కష్టమే. గతంలో లారెన్స్ కి హారర్ సినిమాలు చేయడంలో అనుభవం ఉన్నప్పటికీ, ఇది మాత్రం ప్రత్యేకమైన సినిమాగానే చెప్పుకోవాలి. అందుకు కారణం ఇది రజనీ సెట్ చేసిన పాత్ర కావడమే.