Sunday, February 23, 2025
Homeసినిమా‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు

‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ ఆవిష్కరించిన దర్శకేంద్రుడు

ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహిస్తున్నచిత్రం ‘అతడు-ఆమె-ప్రియుడు’. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై హీరో సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, నటుడు బెనర్జీ ముఖ్య పాత్రల్లో, ఝాన్సీ కూనం (యు.ఎస్.ఎ) సమర్పణలో, రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ విభిన్న కథా చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను శతాధిక చిత్రాల దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆవిష్కరించారు. రచనా సంచలనం యండమూరితో తనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని ఆయన నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు మాట్లాడుతూ “సంధ్య స్టూడియోస్ నిర్మిస్తున్న ‘అతడు ఆమె ప్రియుడు’ ఫస్ట్ లుక్ లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. రచయితగా యండమూరి వీరేంద్రనాధ్ సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసినవే. నా దర్శకత్వంలో రూపొంది అసాధారణ విజయాలందుకున్న ‘ఆఖరి పోరాటం’, ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ చిత్రాల రచయిత యండమూరి దర్శకుడిగా ఇప్పటికే తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘అతడు ఆమె ప్రియుడు’ ఘన విజయం సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టాలి” అని ఆకాంక్షించారు.

యండమూరి మాట్లాడుతూ “రాఘవేంద్రరావు గారు నాకు మంచి మిత్రుడు మాత్రమే కాదు గురువులాంటి వారు కూడా. భారతదేశం గర్వించదగ్గ మహా దర్శకుడాయన. ఆయన మా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి, మా చిత్ర ప్రచారానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది” అన్నారు.

రాఘవేంద్రరావు వంటి దర్శకదిగ్గజం తమ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ చేసి, బ్లెస్ చేయడం సినిమా సాధించబోయే ఘన విజయానికి శుభసూచకమని నిర్మాతలు రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత-వ్యాపారవేత్త అంబికా రాజా, హీరోయిన్ మహేశ్వరి, అమర్, నటుడు భూషణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్