Non-serious:
ఆ వీడియోలో అంత తప్పేముంది..
రాహూల్ గాంధీ తాగి తందనాలాడడం లేదు.
పక్కన చైనా రాయబారి వుంటే అది నేరం ఏం కాదు.
పైగా ఆమెని కలవడానికి రాహూల్ గాంధీ అక్కడికి వెళ్ళలేదు.
అదొక పెళ్ళి పార్టీ.
అక్కడికి ఎవరెవరో సెలెబ్రిటీలు వచ్చారు.
రాహూల్ గాంధీ కూడా వెళ్ళాడు.
దానికి అతన్ని ఎలా తప్పుపట్టగలం.
బిజెపి వాళ్లు చెప్పినట్టు రాహూల్ గాంధీ పబ్ కి ఎంజాయ్ చేయడానికి వెళ్లలేదు.
మరి .. దీన్ని రాజకీయంగా వాడుకోవడం ఏంటి?
ఇక్కడే ఎందుకు వాడుకోకూడదు అనే ప్రశ్న కూడా వస్తుంది.
రాజకీయాలంటేనే అంత.. ఏది దొరికితే దాన్ని వాడుకుంటారు.
సమస్య పెళ్ళి కాదు..
సమస్య.. రాహూల్ చేతిలో మందుబాటిల్ వుందా లేదా అన్నది కాదు.
పక్కనే ఓ మహిళ వుండడం కూడా కాదు..
ఆ జిగేల్ లైట్లు, మెటల్ మ్యూజిక్, పార్టీ వాతావరణం ఇవేమీ తప్పు కాదు..
రాహూల్ గాంధీ ఎక్కడికెళ్ళారన్నది సమస్య కాదు…
ఎప్పుడు వెళ్లాడు?
ఏ పరిస్థితిలో వెళ్ళాడు.
ఇదీ ఇక్కడ సమస్య.
ఒక పక్క దేశం ఉక్కు సంకెళ్ళలో ఊపిరాడకుండా వుంది.
హిజాబ్, హలాల్, అజా..హనుమాన్ చాలీసాలు..
అరెస్టులు, కేసులు, బుల్డోజర్లు.
ఒకదాని తర్వాత ఒకటి విరుచుకుపడుతున్నాయి.
ఈ దాడుల నుంచి తప్పించే ఒక అసరా కోసం..
ఒక ఆల్టర్నేట్ ఎజెండా కోసం..
దేశ ప్రజలు ఎదురుచూస్తున్న సందర్భమిది.
ఇటు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అధ్వాన్నంగా వుంది.
వరస ఎన్నికల్లో ఓటములు..
రాష్ట్రం తర్వాత రాష్ట్రం చేజారుతోంది.
ఎక్కడికక్కడ పార్టీలో అంతఃకలహలు.
అసమ్మతులు.
పార్టీ మొత్తం ఓ దిశానిర్దేశం కోసం రాహూల్ వైపు చూస్తున్న సందర్భమిది.
అన్నిటికీ మించి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అత్యంత బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటోంది.
ఎంత బలమున్నా.. ఒక్క క్షణం కూడా ఏమరపాటు తెలియని ప్రత్యర్థితో తలపడుతోంది..
ప్రతిక్షణం వ్యూహ ప్రతి వ్యూహాలతో విరుచుకుపడే ప్రత్యర్థిని ఓడించాల్సిన సందర్భమిది..
ఇవన్నీ జరగాలంటే.. రాహూల్ గాంధీ ఏం చేయాలి.
నిరంతరం జనం మధ్య వుండాలి.
జనం పోరాటాల్లో ఉండాలి.
కేంద్ర ప్రభుత్వానికి కంట్లో నలుసులా, కాలికింద ముల్లులా తయారవ్వాలి.
కానీ, ఆయనేం చేస్తున్నాడు.
జనవరిలో అయిదురాష్ట్ర్రాల వోటమి తర్వాత రాహూల్ కనపడింది ఇప్పుడే..
ఈ వీడియోలోనే.
అదీ సమస్య..
హోరా హోరీ పోరులో వున్నవాడికి వ్యక్తిగత సమయాలేం వుండవు.
నిర్విరామ యుద్ధంలో కాసేపు బ్రేక్ అంటే కుదరదు..
ప్రత్యర్థి బలవంతుడైనప్పుడు పొరపాటున కూడా అవకాశం ఇవ్వకూడదు.
కానీ రాహూల్ గాంధీ ఎప్పుడూ ఇలాంటి అవకాశాలే ఇస్తుంటాడు.
ఒకసారి విపాసన..
ఇంకోసారి విదేశీ యాత్రలు.
ఇప్పుడు వివాహ వేడుకలు..
వీటిని ఎంతగా సమర్ధించుకున్నా..
జరగాల్సిన నష్టం జరిగిపోతూనే వుంటుంది.
తప్పొప్పుల చర్చ ఎలా వున్నా..
రాహూల్ పార్టీకి మాత్రం చాలా నష్టం చేశారు.
మూలిగే నక్క మీద తాటికాయ పడేశారు.
జనానికి ఇంకో ఆశ.. ఆసరా లేకుండా చేశారు.
– సరళి
Also Read :