భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం..ప్రస్తుతానికి తీవ్రవాయుగుండం కారైకాల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 770కి.మీ, చెన్నైకి 830కి.మీ దూరంలో కేంద్రీకృతం అయింది. సాయంత్రానికి తుఫానుగా బలపడనున్న తీవ్రవాయుగుండం.. రేపు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం సమీపంలోని ఉత్తర తమిళనాడు- దక్షిణకోస్తాంధ్ర మధ్య తుఫాన్ తీరం దాటనుంది. ఆ తదుపరి 48 గంటలు ఉత్తర తమిళనాడు -దక్షిణకోస్తా తీరాలకు ఆనుకుని కొనసాగనున్న తుఫాన్..దీని ప్రభావంతో రేపటి నుంచి మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని ప్రకాశం, SPSR నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
రాయలసీమలోని చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటి నుంచి తీరం వెంబడి గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని..తుపాన్ ప్రభావిత జిల్లాల యంత్రాంగానికి ఇప్పటికే సూచనలు జారీ చేశారు. సముద్రం అలజడిగా ఉంటుందని, దక్షిణకోస్తా – తమిళనాడు తీరాల వెంబడి శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వేటకు వెళ్ళిన మత్స్యకారులు వెంటనే వెనక్కి తిరిగి రావాలన్నారు. వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ – డా.బి.ఆర్ అంబేద్కర్ సూచించారు.