మునుగోడు శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై 22,552 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపిలో చేరుతున్న దరిమిలా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. నేడు ఉదయం 10.30కు నాంపల్లి అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ కు సమర్పించారు.
తన రాజీనామాను ఆమోదిస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారని రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు. అయితే స్పీకర్ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
గవర్నర్ శ్రీమతి తమిలి సై సౌందర రాజన్ ను కాసేపట్లో రాజగోపాల్ రెడ్డి కలవనున్నారు.
రాజగోపాల్ రెడ్డి 2009 ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో ఆయన టి ఆర్ ఎస్ నేత డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనతరం 2017శాసన మండలి ఎన్నికల్లో నల్గొండ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి గెలుపొంది ఎమ్మెల్సీ అయ్యారు. 2018లో మునుగోడు నుంచి పోటీ చేశారు.
Also Read : కాంగ్రెస్ కు భవిష్యత్తు లేదు రాజగోపాల్ రెడ్డి