రాజ్‌తరుణ్ హీరోగా శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ ‘పురుషోత్తముడు’ అనే చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించింది. రమేష్ తెజావత్, ప్రకాష్ తెజావత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రామ్ భీమన దర్శకత్వం వహిస్తున్నారు. ముంబైకు చెందిన హాసిని సుధీర్ కథానాయికగా పరిచయం అవుతుంది. పూజా కార్యక్రమాల అనంతరం ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ కెమేరా స్విచ్చాన్ చేయగా ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు వీరశంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. ఛాంబర్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, స్వామినాయుడు, రాజారవీంద్ర, సూర్యకిరణ్, చేతన్ చీను, దాసరి కిరణ్ కుమార్, మధు మదాసు తదితరులు ముఖ్య అతిధులుగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
కథానాయకుడు రాజ్ తరుణ్ మాట్లాడుతూ… దర్శకుడు రామ్ గారు కథ చెప్పగానే కొత్తగా అనిపించింది. అలాగే ఎగ్జైట్ మెంట్ కలిగించింది. ఇక నిర్మాతలలో మంచి సినిమా తీయాలనే తపన కనిపించిది. ఈ సినిమాతో పి.జి. విందా గారితో పనిచేసే అవకాశం దొరికింది. గోపీసుందర్‌తో పని చేయడం హ్యాపీ. హీరోయిన్ హాసిని తెలుగు నేర్చుకుని సినిమా చేయడం ఆమెకు సినిమా పై వున్న ప్రేమను తెలియజేస్తుంది. పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా, ఎమోషన్స్ అన్నీ వుంటాయి. నేను ఎందులో పురుషోత్తముడు అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే అని అన్నారు.