Wednesday, February 26, 2025
HomeTrending News#NTRCentenary: బాబు విజన్ తో ఏపీ నంబర్ వన్: రజనీకాంత్

#NTRCentenary: బాబు విజన్ తో ఏపీ నంబర్ వన్: రజనీకాంత్

చంద్రబాబు తనకు 30 ఏళ్ళ స్నేహితుడని, మోహన్ బాబు తనకు పరిచయం చేశారని తమిళ స్టార్ రజనీకాంత్ వెల్లడించారు. ఆయన్ను కలిసినప్పుడు ఆయన చెప్పే విజన్ తనను ఎంతో ఆకట్టుకుందని చెప్పారు. బాబు ఓ విజన్ ఉన్న నాయకుడని, ఆయన టాలెంట్ ఏమిటో దేశంలోనే కాక ప్రపంచ నాయకులకూ తెలుసని చెప్పారు. ఇటీవల బాబును కలిసినప్పుడు 2047 కు ఆయన ఓ విజన్ పెట్టుకున్నారని అది సాకారం అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ అవుతుందని, 2024 ఎన్నికల్లో బాబు తప్పకుండా విజయం సాధిస్తారని రజనీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆత్మ బాబును ఆశీర్వదించి… తగిన శక్తి ఇవ్వాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ అసెంబ్లీ, ఇతర ముఖ్య ప్రసంగాల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రజనీ ప్రసంగిస్తూ ‘ఇక్కడి అభిమానుల ఉత్సాహం చూస్తుంటే రాజకీయాలు మాట్లాడాలనిపిస్తుంది, కానీ అనుభవం మాత్రం వద్దురా రజనీ అంటూ చెబుతోంద’ని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు 1996లోనే విజన్ 2020 గురించి చెప్పారని రజనీకాంత్ ప్రశంసించారు. హైదరాబాద్ ను హై టెక్ సిటీగా మార్చి, ప్రపంచంలోనే పెద్ద పెద్ద బిజినెస్ టైకూన్స్ ను ఇక్కడికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. బాబు కృషి వల్లే ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది తెలుగువారు టెకీలుగా ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఇటీవల జైలర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు రాత్రి సమయంలో బంజారా హిల్స్  లో ప్రయాణిస్తే ఇండియాలో ఉన్నానా, న్యూయార్క్  లో ఉన్నానా అనే అనుమానం కలిగిందన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్