ఇప్పుడంటే రాజశేఖర్ వరుస పరాజయలతో ఉన్నారుగానీ, ఒకానొక సమయంలో యాంగ్రీ యంగ్ మెన్ గా వెండితెరపై ఆయన చెలరేగిపోయారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేయాలంటే, ముందుగా రాజశేఖర్ నే సంప్రదించేవారు. ఎందుకంటే ఆ పాత్రలపై ఆయన చూపించిన మార్క్ వేరు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా ఆడియన్స్ ను మెప్పిస్తూ వెళ్లారు. ఒక వైపున యాక్షన్ సినిమాలు .. మరో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన సినిమాలు ఒకే సమయంలో చేస్తూ మెప్పించడం ఆయనకి మాత్రమే చెల్లింది.
అలాంటి రాజశేఖర్ కి ఈ మధ్య కాలంలో సక్సెస్ లు లేవు. కెరియర్ లో ఎవరికైనా ఇలాంటి ఒక సమయం రావడం సహజం. అలాంటి ఒక సమయంలోనే విలన్ పాత్రల దిశగా వెళ్లిన జగపతిబాబు, ఈ రోజున స్టార్ విలన్. ఆయన డేట్స్ దొరక్క ఇతర భాషల్లోని మేకర్స్ సైతం వెయిట్ చేసే పరిస్థితి. అదే రూట్లో రాజశేఖర్ కూడా వెళితే బాగుంటుందని ఆయన అభిమానులు భావించారు. అలాంటివారి కోరిక ఫలించే సమయం దగ్గరికి వచ్చేసిందనే అనుకోవాలి. ఎందుకంటే మొదటిసారిగా ఆయన ‘ఎక్స్ ట్రా’ ఆర్డినరీ మేన్’ సినిమాలో ప్రత్యేకమైన రోల్ చేశారు.
ఈ సినిమాలో రాజశేఖర్ రోల్ చాలా ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుందని మేకర్స్ చెబుతూ వస్తున్నారు. ఈ పాత్ర జనంలోకి వెళితే రాజశేఖర్ ఇలాంటి రోల్స్ తో ముందుకు వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పుడు ప్రేక్షకులు ఏ సినిమాకి ఆ సినిమాగానే చూస్తున్నారు. స్టార్ హీరోలను విలన్స్ గా చూడటానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. అందువలన విలన్ వేషాలతో రాజశేఖర్ ముందుకు వెళ్లడానికి ఇది సరైన సమయం. అలాంటి పాత్రలలో మెప్పించే సామర్థ్యం కూడా ఆయనకి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.