గోపీచంద్ అనగానే ఆయన చేసిన యాక్షన్ సీన్స్ కళ్లముందు కదలాడతాయి. మంచి హైటూ .. పర్సనాలిటీ ఆ తరహా జోనర్స్ కి సరిపోయాయి. ఇక మాస్ డైలాగ్స్ చెప్పడంలోనూ గోపీచంద్ కి తనకంటూ ఒక స్టైల్ ఉంది. అయితే గోపీచంద్ కి డాన్సులు రావు .. కామెడీ చేయలేడు .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించలేడు అనే విమర్శలు ఆరంభంలో వచ్చాయి. దాంతో తనని తాను మార్చుకుంటూ .. విమర్శలను తిప్పికొడుతూ తన సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వచ్చేలా చేసుకున్నాడు.
గోపీచంద్ అంటే ఫ్యాక్షన్ సినిమాలు మాత్రమే కాదు .. ఫ్యామిలీ సినిమాలను కూడా చేయగలడు అని నిరూపించుకున్నాడు. అలాంటి గోపీచంద్ తన తాజా చిత్రమైన ‘రామబాణం’ సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ముందుకు వచ్చాడు. గతంలో శ్రీవాస్ – గోపీచంద్ కాంబినేషన్లో వచ్చిన ‘లక్ష్యం’ .. ‘లౌక్యం’ సినిమాల మాదిరిగానే ఇది కూడా ఉంటుందని భావించిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. శ్రీవాస్ టేకింగ్ .. గోపీచంద్ యాక్షన్ .. జగపతిబాబు ఎమోషన్ దేనికీ వంక బెట్టడానికి లేదు. కాకపోతే ఆల్రెడీ చూసేసిన సినిమా మాదిరిగానే అనిపిస్తూ ఉంటుంది.
గోపీచంద్ ఇక ఈ మూస కథల నుంచి … పాత్రల నుంచి బయటికి రావలసిన అవసరం ఎంతైనా ఉంది. కథలో కొత్తదనం .. పాత్రలో వైవిధ్యం .. తనని కేంద్రంగా చేసుకుని నడిచే పాత్రలతో సహా ఆయన ఆలోచన చేయవలసి ఉంది. ఈ ట్రెండ్ వేరు .. పాత కథలను .. పాత ధోరణిలోనే చెబుతామంటే చూసే పరిస్థితి లేదు. అందువలన గోపీచంద్ ఇక తన కెరియర్ విషయంలో చాలా కేర్ తీసుకోవలసిన సమయం ఇది. ఇటీవల ఆయన చేసిన సినిమాలు .. వాటి ఫలితాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది.