Friday, January 24, 2025
Homeసినిమారవితేజ మార్క్ కి దూరంగా వెళ్లిన రామారావు!

రవితేజ మార్క్ కి దూరంగా వెళ్లిన రామారావు!

Movie Review: మొదటి నుంచి కూడా రవితేజ కొత్త దర్శకులకు అవకాశాలిస్తూ వస్తున్నాడు. ఆయన సినిమాలతో దర్శకులుగా పరిచయమై, స్టార్ డైరెక్టర్లుగా ఎదిగినవాళ్లు చాలామందే ఉన్నారు. అలా ‘రామారావు ఆన్ డ్యూటీ‘ అనే సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయమయ్యాడు. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా, ఈ రోజునే భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సబ్ కలెక్టర్ పాత్రలో రవితేజ నటించిన ఈ సినిమాలో, ఆయన సరసన నాయికలుగా దివ్యాన్ష కౌశిక్ – రజీషా విజయన్ నటించారు. ఈ సినిమాతోనే వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ ఇచ్చాడు.

నీతీ .. నిజాయితి అంటూ అవినీతిని ప్రశ్నించే అధికారులకు బదిలీలు తప్పవు. అలా రామారావు(రవితేజ)కి తన సొంతవూరుకి బదిలీ అవుతుంది. భార్య బిడ్డలను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్లిన ఆయనకి, గతంలో తాను మనసుపడిన మాలిని(రజీషా) తారసపడుతుంది. కనిపించకుండా పోయిన భర్త కోసం ఎదురుచూస్తూ, ఆమె కష్టాలు పడుతుంటుంది. ఆమె భర్త ఆచూకీ తెలుసుకోవడం కోసం  రంగంలోకి దిగిన రామారావుకి కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అవేమిటి? అప్పుడు ఆయన ఏం చేస్తాడు? పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనేదే కథ.

ఇది రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథనే .. ఆయన తన ఎనర్జీని చూపించడానికి అవకాశమున్న పాత్రనే. కానీ రవితేజ మార్క్ కీ .. ఆయన  స్టైల్ కి దూరంగా ఇది నడిచింది. ఆయనలో ఆ జోష్ ను .. ఫోర్స్ ను దర్శకుడు చూపించలేకపోయాడు. బలహీనమైన కథాకథనాలు ఓపికకు పెద్ద పరీక్షనే పెడతాయి. కథలో మలుపులకంటే కుదుపులు ఎక్కువ. ముఖ్యంగా మాస్ డైలాగ్స్ మరింత పలచబడ్డాయి. క్లైమాక్స్ ఏ రేంజ్ లో  ప్లాన్ చేశారా అని మనం ఎదురుచూస్తుంటే, సీక్వెల్  సిగ్నల్ దగ్గర మనని దింపేసి రామరావు చక్కాపోయాడు.  సంగీతం విషయానికి వస్తే ఫరవాలేదు. కెమెరాపనితనం సినిమాను కొంతవరకూ కాచుకుందనే చెప్పాలి. ఏదో చేయాలనుకుంటే ఏదో అయిందని అనుకుంటూ ఉంటామే .. ఈ సినిమా విషయంలో అదే జరిగిందని అనిపించకమానదు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్