Sunday, January 19, 2025
HomeTrending Newsవిభజన హామీలు తేల్చండి: రామ్మోహన్ నాయుడు

విభజన హామీలు తేల్చండి: రామ్మోహన్ నాయుడు

ప్రత్యేకహోదాతో పాటు  ఆంధ్ర ప్రదేశ్ కు విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత కింజరాపు రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన లోక్ సభ లో మాట్లాడుతూ … ఈ అంశంపై తొలిరోజు నుంచీ తాము మాట్లాడుతూనే ఉన్నామని, కానీ కేంద్ర ప్రభుత్వం  హామీల అమల్లో చిత్తశుద్ధి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  నిర్దిష్ట కాలపరిమితి లోగా ఈ హామీలన్నీ అమలు చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఇంతవరకూ ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు.

పదేళ్ళపాటు  ప్రత్యేక హోదా అమలు చేయాలని చట్టం చేసినా దాన్ని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రం ఎంతగానో నష్టపోయిందని కేంద్రం దృష్టికి తీసుకు వచ్చారు.  కేంద్ర విద్యా సంస్థలను కేటాయించారని, దానికి సంబంధించి గత టిడిపి ప్రభుత్వం భూమి కేటాయించినా శాశ్వత భవనాలు ఇంతవరకూ పూర్తి  చేయలేదని, ఇప్పటికీ ఆ సంస్థలు అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయని తెలిపారు.

తాము అధికారంలో ఉన్న ఐదేళ్లలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 1,050 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందని, కానీ వైసీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకు రాలేకపోయిందని అన్నారు.  రైల్వే జోన్ విషయంలో కూడా రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దిశగా యత్నాలు చేయడం శోచనీయమన్నారు. తాము  పోలవరం ప్రాజెక్టు 70 శాతం పూర్తి చేశామని, కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని,  విభజన హామీలు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్