Monday, January 20, 2025
Homeసినిమాఓ నీలాంబరి .. ఓ శివగామి

ఓ నీలాంబరి .. ఓ శివగామి

తెలుగు తెరకి పరిచయమైన నిన్నటితరం అందమైన కథానాయికలలో రమ్యకృష్ణ ఒకరు. చాలా చిన్న వయసులోనే రమ్యకృష్ణ కెమెరా ముందుకు వచ్చారు. చిత్రపరిశ్రమలో కథానాయికగా అవకాశాలు రావాలంటే గ్లామరస్ పాత్రలనే పోషించాలి. కాస్త కుదురుకున్న తరువాత అభినయ ప్రధానమైన పాత్రలను చేయాలి. ఆరంభంలోనే నటన ప్రధానమైన పాత్రలను మాత్రమే చేస్తానని అంటే అవకాశాలు వస్తాయనే నమ్మకం లేని పరిస్థితి. ఎందుకంటే 1980లలో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ ఉండేది.

అందువలన రమ్యకృష్ణ గ్లామరస్ పాత్రలకి ప్రాధాన్యతనిచ్చారు. తెలుగు తెరకి తన నాజూకుదనాన్ని పరిచయం చేశారు. ‘మదన గోపాలుడు’ సినిమాలో ఆమె అందాలు ఆరబోశారు. అయితే రమ్యకృష్ణలో అందమే కాదు అంతకు మించిన అభినయం కూడా ఉందని దర్శకుడు కె. విశ్వనాథ్ గుర్తించారు. ‘సూత్రధారులు’ సినిమాలు ఆమెకి అవకాశం ఇచ్చారు. లుక్ పరంగా .. నటన పరంగా ఒక కొత్త రమ్యకృష్ణను ఆయన తెరపై చూపించారు. అక్కినేని .. సుజాత .. భానుచందర్ వంటి సీనియర్ స్టార్ లతో కలిసి ఆమె ‘సీతాలు’ పాత్రను గొప్పగా పోషించారు.

80వ దశకంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ, తన ఉనికిని కాపాడుకుంటూ వచ్చిన రమ్యకృష్ణ, 90వ దశకంలో దూసుకుపోయారు. ఈ దశకం ఆమె కెరియర్లో స్వర్ణయుగం వంటిదని చెప్పుకోవాలి. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఆమె చేసిన ‘అల్లుడు గారు’  సినిమా, అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. అందం .. అభినయం పరంగా రమ్యకృష్ణకి నూటికి నూరు మార్కులు తెచ్చిపెట్టిన సినిమా ఇది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమాతో, హీరోయిన్ గా రమ్యకృష్ణ పదేళ్లపాటు వెనుదిరిగి చూసుకోలేదు.

చిరంజీవి .. బాలకృష్ణ .. నాగార్జున .. వెంకటేశ్ … జగపతిబాబు … రాజశేఖర్ .. శ్రీకాంత్ వంటి హీరోలతో ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. ‘అల్లరి మొగుడు’ .. ‘అల్లరి ప్రియుడు’ .. ‘బంగారు బుల్లోడు’ .. ‘హలో బ్రదర్’ . ‘ఆయనకి ఇద్దరు’ .. ‘అమ్మోరు’ .. ‘ఆహ్వానం’ వంటి సినిమాలు రమ్యకృష్ణ కెరియర్లో చెప్పుకోదగినవిగా కనిస్తాయి. లవ్ … రొమాన్స్ .. ఎమోషన్ .. కామెడీని సైతం పండించడంలో రమ్యకృష్ణ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తన స్టార్ డమ్ ఎక్కడా ఎంతమాత్రం తగ్గకుండా చూసుకున్నారు.

రమ్యకృష్ణ కెరియర్ ను అత్యంత ప్రభావితం చేసిన సినిమాగా తమిళంలో వచ్చిన ‘పడయప్పా’ను  చెప్పుకోవచ్చు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా, తెలుగులో ‘నరసింహా’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ‘నీలాంబరి’ పాత్రలో ఆమె కథానాయకుడి పట్ల ప్రేమతో తపించిపోతుంది .. పగతో రగిలిపోతుంది. ఈ పాత్రలో  ఆమె చూపించిన నటన విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. ఆమె కెరియర్లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.

ఇక ఆ తరువాత ‘బహుబాలి’ సినిమాలో రమ్యకృష్ణ పోషించిన ‘శివగామి’ పాత్ర కూడా అంతగానూ ఆమె కెరియర్ ను ప్రభావితం చేసింది. “ఇదే నా మాట .. నా మాటే శాసనం” అంటూ ఈ పాత్రలో ఆమె అసమానమైన అభినయాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ, ఆ పాత్రలో రమ్యకృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోవడం కష్టమని తేల్చేశారు. అంతలా ఆమె శివగామి పాత్రలో ఒదిగిపోయారు. ఈ  సినిమాతో రమ్యకృష్ణ పేరు ప్రతిష్ఠలు సరిహద్దులు టివెళ్లాయి. ప్రశంసల వర్షంలో ఆమె తడిసేలా చేశాయి. ఈ సినిమాతో రమ్యకృష్ణ మరింత బిజీ అయ్యారు.

రమ్యకృష్ణ గ్లామర్ లో పెద్దగా మార్పురాలేదు. అందువలన ‘సోగ్గాడే చిన్నినాయనా’ వంటి రొమాంటిక్ సినిమాలో ఆమె అలరించగలిగారు. శివగామి తరువాత వాణిశ్రీ .. జయచిత్ర మాదిరిగా పవర్ఫుల్ అత్త పాత్రలలోను మెప్పించడం మొదలుపెట్టారు. ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమాను అందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హీరో ఎవరైనా .. దర్శకుడు ఎవరైనా రమ్యకృష్ణ ఇప్పుడు సినిమాకి అదనపు బలంగా మారిపోయారు. నిండుదనం .. హుందాతనం .. దర్పం … దర్జాతో కూడిన పాత్రలకి చిరునామాగా ఎదిగిపోయారు.

అందం పరంగా … అభినయం పరంగా రమ్యకృష్ణ చాలా గట్టిపోటీని తట్టుకుని నిలబడ్డారు. విజయశాంతి … రాధ .. భానుప్రియ … సుహాసిని వంటి స్టార్ హీరోయిన్ల మధ్యలో తనదైన ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమె ఎంతో కృషి చేశారు. ఆ తరువాత వచ్చిన వచ్చిన రోజా .. రంభ .. సౌందర్య వంటివారికి కూడా ఆమె గట్టిపోటీ ఇచ్చారు. వాళ్లంతా ఒక స్థాయి తరువాత నటనకి దూరమైనా, రమ్యకృష్ణ మాత్రం ఎదురులేని విధంగా తన కెరియర్ ను పరుగులు తీయిస్తున్నారు.

ఇప్పుడే కాదు ఇక ముందు కూడా రమ్యకృష్ణ అంటే ఒక నీలాంబరి .. ఒక శివగామి గానే ప్రేక్షకులకు గుర్తుండిపోతారు. అది ఆ పాత్రల గొప్పతనం … ఆమె నటనా వైభవం. వయసుతో పాటు  తన ప్రాధాన్యతను … పారితోషికాన్ని .. క్రేజ్ ను పెంచుకుంటూ వెళ్లిన కథానాయికలు కొంతమందే కనిపిస్తారు. అలాంటి అతికొద్ది మందిలో రమ్యకృష్ణ ఒకరని చెప్పుకోవాలి. ఈ రోజు (సెప్టెంబర్ 15)న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

(రమ్యకృష్ణ బర్త్ డే స్పెషల్)

— పెద్దింటి గోపీకృష్ణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్