Saturday, January 18, 2025
Homeసినిమాపాత కథకు కొత్త రంగులద్దితే 'రంగరంగ వైభవంగా'  

పాత కథకు కొత్త రంగులద్దితే ‘రంగరంగ వైభవంగా’  

Movie Review: తెలుగు తెరపై ప్రేమకథా చిత్రాలకు ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. ప్రేమకథను అందంగా .. ఆకట్టుకునే విధంగా కొత్త కోణంలో ఆవిష్కరిస్తే, యూత్ తప్పకుండా ఆదరిస్తారనడానికి నిదర్శనంగా ఎన్నో సినిమాలు కనిపిస్తాయి. ఆ ప్రేమ పెద్దల అంగీకారం .. కుటుంబ సభ్యుల ఆమోదాన్ని కోరుకుంటే వెంటనే అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కూడా మారిపోతుంది. అలాంటి ఒక ప్రేమకథతో రూపొందిన సినిమానే ‘రంగరంగ వైభవంగా‘. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. వైష్ణవ్ తేజ్ .. కేతిక శర్మ జంటగా గిరిశాయ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

హీరో హీరోయిన్ స్కూల్ డేస్ లో నుంచే లవ్ చేసుకోవడం .. ఆ తరువాత ఒకరిపై ఒకరు అలగడం .. అదే కాలేజ్ ఏజ్ వరకూ కంటిన్యూ కావడం .. తీరా కోపాలు పక్కన పెట్టేసి పెళ్లి చేసుకుందామంటుకుంటే, రెండు కుటుంబాల మధ్య అడ్డుగోడలు ఏర్పడటం వంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి లక్షణాలతో కూడిన మరో కథనే ‘రంగరంగ వైభవంగా’. వైజాగ్ లోని ఒక కాలనీలో జరిగే కథ ఇది. ఇద్దరు ప్రాణ స్నేహితులు (ప్రభు – నరేశ్) పక్క పక్కనే ఇళ్లు కట్టుకుంటారు. రెండు కుటుంబాలవారు ఒక కుటుంబం మాదిరిగా కలిసిపోతారు.

నరేశ్ చిన్నబ్బాయ్ రుషి (వైష్ణవ్ తేజ్) ప్రభు రెండవ కూతురు రాధ (కేతిక శర్మ) ప్రేమలో పడతారు .. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అయితే ఈ లోగా రుషి అన్నయ్య బాలు .. రాధ అక్కయ్య ప్రేమ విషయం బయటపడటంతో పెద్ద గొడవ జరుగుతుంది. అందుకు కారకుడు ఆ ఇద్దరు ఆడపిల్లలకు అన్నయ్య అయిన అర్జున్ (నవీన్ చంద్ర). ఆ సంఘటన తరువాత రెండు కుటుంబాల మధ్య బంధం తెగిపోతుంది. ఈ రెండు జంటల పెళ్లి జరగాలంటే పరిస్థితులు సర్దుకోవాలి. అందుకోసం హీరో హీరోయిన్లు కలిసి ఏం చేశారనేదే కథ.

కథ ఇంతకుముందు విన్నట్టుగా .. చూసినట్టుగా అనిపించినా, తనదైన తరహాలో ప్రేక్షకులను మెప్పించడానికి గిరీశాయ గట్టిగానే ప్రయత్నించాడు. ఫస్టాఫ్ విషయంలో చాలా వరకూ సక్సెస్ ను సాధించాడు కూడా. సెకండాఫ్ లోనే కాస్త కుదుపులు ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది. మరీ హీరో .. హీరోయిన్ పైనే ఫోకస్ పెట్టకుండా, చుట్టూ ఉన్న మిగతా పాత్రలను కూడా దర్శకుడు బాగానే డిజైన్ చేశాడు. సాధ్యమైనంత వరకూ బోర్ కొట్టకుండా కథను పరిగెత్తించడానికి ట్రై చేశాడు. ప్రధాన పాత్రధారులంతా ఎవరి పరిథిలో వారు నటించారు.

నటన పరంగా వైష్ణవ్ కాస్త దారిలో పడ్డాడు. కేతిక నటన ఈ సినిమాకి హైలైట్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా చెప్పుకోవాలి. ‘కొత్తగా లేదేంటి’ అనే పాట ఈ సినిమాకి హైలైట్. ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మెలోడీ అనే చెప్పుకోవాలి. చిత్రీకరణ పరంగా కూడా ఈ పాట మంచి మార్కులు కొట్టేసింది. ఫొటోగ్రఫీ ఈ సినిమాకి అదనపు బలంగా నిలిచింది. రొటీన్ కథతోను  మెప్పించగలను అనే నమ్మకంతో బరిలోకి దిగిన ఈ దర్శకుడి నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి.

Also Read : ఆసక్తికరమైన కథ లేకుండా చేసిన హడావిడినే  ‘కోబ్రా’  

RELATED ARTICLES

Most Popular

న్యూస్