Friday, October 18, 2024
HomeసినిమాRangamarthanda: బ్రహ్మానందం నట విశ్వరూపమే 'రంగమార్తాండ'! 

Rangamarthanda: బ్రహ్మానందం నట విశ్వరూపమే ‘రంగమార్తాండ’! 

Review: కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ‘రంగమార్తాండ’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. నిజం చెప్పాలంటే భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో సినిమాలు చేసిన కృష్ణవంశీ చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా ఇది. అనేక పాత్రలతో వెండితెరను కలర్ ఫుల్ గా నింపేసే కృష్ణవంశీ, చాలా తక్కువ పాత్రలతో తెరకెక్కించిన సినిమా ఇది. ఇది నాటకాలతో ముడిపడిన కథ అనే విషయం టైటిల్ ను బట్టే ఆడియన్స్ కి అర్థమైపోయింది. దాంతో కంటెంట్ పై ఒక అవగాహనతోనే థియేటర్స్ కి వెళ్లారు.

ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. రమ్యకృష్ణ .. బ్రహ్మానందం ప్రధానమైన పాత్రలను పోషించారు. కథా  పరంగా ప్రకాశ్ రాజ్ – రమ్యకృష్ణ తెరపై ఎక్కువగా కనిపిస్తారు. బ్రహ్మానందం మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. బ్రహ్మానందం పాత్ర నిడివి సంగతి అలా ఉంచితే, ఆయన నటనను ప్రేక్షకులు అలా చూస్తుండిపోయారు. థియేటర్లలో ఆయన పాత్రను కన్నీళ్లు తుడుచుకుంటూ మరీ చూశారు. అంత గొప్పగా ఆయన ఈ పాత్రలో ఇమిడిపోయారు .. ఒదిగిపోయారు.

ప్రకాశ్ రాజ్ ఈ తరహా పాత్రలలో ఎలా చేస్తాడనేది అందరికీ తెలుసు. అలాగే హాస్యభరితమైన పాత్రలకు బ్రహ్మానందం ఎలా ప్రాణం పోస్తారనేది తెలుసు. ఎమోషన్స్ తో కూడిన పాత్రలను ఆయన ఇంతకుముందు చేసినప్పటికీ, ఈ స్థాయిలో వాటిని డిజైన్ చేయలేదు. రంగస్థల నటుడిగా .. తన స్నేహితుడి కుటుంబం బాగు కోరుకునే వ్యక్తిగా .. భార్య దూరం కావడాన్ని భరించలేని భర్తగా చక్రపాణి పాత్రలో ఆయన జీవించాడు. ‘నా భార్యను బ్రతికించరా’ అని స్నేహితుడిని కోరే సన్నివేశంలో .. ‘నాకు విముక్తిని ప్రసాదించరా’ అని అభ్యర్థించే పాత్రలో ఆయన నటనకి కన్నీళ్లు ఆపుకోవడం కష్టమే. కృష్ణవంశీ – ప్రకాశ్ రాజ్ ప్రతిభ అలా ఉంచితే, ఈ సినిమాను బ్రహ్మానందం నట విశ్వరూపంగా కూడా చెప్పుకోవచ్చు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్