ఆఫ్ఘనిస్తాన్ టి-20 జట్టు కెప్టెన్ గా ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఎంపికయ్యాడు. నజీబుల్లా జద్రాన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. నేడు సమావేశమైన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసిబి )ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఏసిబి చైర్మన్ ఫర్హాన్ యూసుఫ్ జై ఈ విషయాన్ని వెల్లడించాడు.
రషీద్ ఖాన్ కొంత కాలంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టులో అత్త్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐసిసి టి-20 బౌలింగ్ వరల్డ్ ర్యాంకింగ్ లో నంబర్ 2గా కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికా స్పిన్ బౌలర్ తబ్రైజ్ షంసి కంటే 31 పాయింట్లు వెనకబడి ఉన్నాడు రషీద్. వన్డే-టెస్ట్, టి-20 జాతీయ జట్టులకు విడివిడిగా కెప్టెన్ల ను నియమించాలని ఏసిబి ఇటీవలే నిర్ణయించింది. దీనికి తగ్గట్లుగానే ప్రస్తుత కెప్టెన్ అస్ఘర్ ఆఫ్ఘాన్ కు ఉద్వాసన పలికింది. వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ గా ఎడమచేతి వాటం బాట్స్ మాన్ హస్మతుల్లా షాహిది, రహ్మత్ షా వైస్ కెప్టెన్ గా నియమించారు.
ఐపిఎల్ లో కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టుకు ఆడుతున్న రషీద్ ఖాన్ తన బౌలింగ్, బ్యాటింగ్ తో భారత క్రికెట్ ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు.