Mini Review: రవితేజ కథానాయకుడిగా రూపొందిన ‘రావణాసుర’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మొదటి నుంచి కూడా అందరిలో ఆసక్తిని పెంచుతూనే వచ్చింది. టైటిల్ ‘రావణాసుర’ అంటున్నారు .. ఐదుగురు హీరోయిన్స్ అంటున్నారు .. హీరోనే నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేస్తే, ఇక విలన్ ఎవరు? అనే సందేహాలే అందరిలో ఈ ఆసక్తిని రేకెత్తించాయి. ఇక ఈ సినిమాకి రవితేజ కూడా ఒక నిర్మాతగా ఉన్నాడంటే, బలమైన విషయమేదో ఉండే ఉంటుందని భావించడం సహజం.
ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ షేడ్స్ పోషిస్తున్నాడనే విషయం అందరికీ తెలుసు, “సీతను తీసుకెళ్లాలంటే సముద్రాన్ని దాటితే సరిపోదు, రావణుడిని దాటి వెళ్లాలి” అంటూ రవితేజ ట్రైలర్ లో చెప్పిన డైలాగ్ తోనే ఆయన క్యారెక్టరైజేషన్ అర్థమైపోయింది. ఈ సినిమాలో ఆయన ముఖాలు (మాస్కులు) మారుస్తూ నేరాలు చేస్తూ వెళుతుంటాడు. అచ్చుగుద్దినట్టుగా వేరేవారి ముఖాన్ని పోలిన మాస్క్ ను తయారు చేయించి, హీరో దానిని ధరించాడనే అనుకుందాం. అప్పుడు మాస్క్ తో పాటు అవతలివారి హైటూ .. పర్సనాలిటీ కూడా హీరోకి సెట్ కావాలి .. లేదంటే దొరికిపోవడం ఖాయం.
ఈ సినిమాలో దర్శకుడు ఈ లాజిక్ నే వదిలేశాడు. ఈ సినిమాలో హీరో తనకంటే హైట్ .. తనకంటే లావుగా ఉన్నవారి ముఖాలను మాస్కులుగా ధరించి చేయవలసిన నేరాలు చేసేస్తుంటాడు. అసలు హీరో ఎందుకు రావణాసురుడుగా మారాడు అనడానికి వేరే కారణం ఉంది .. అది సస్పెన్స్ సెక్షన్ లోకి వెళ్లిపోతుంది. మరి ఐదుగురు హీరోయిన్స్ ఎవరి కోసం? ఎందుకోసం? అని అడిగితే, ఈ విషయాన్ని కూడా ఉన్నపళంగా సస్పెన్స్ కేటగిరీలోకి తోసేయవలసిందే. ఈ విషయంలో ఆడియన్స్ ఊహించింది ఒకటి .. దర్శకుడు ఆలోచించింది ఒకటి. కథకి ఏది సెట్ అయిందనే విషయంలో క్లారిటీ రావాలంటే, సినిమా చూడాల్సిందే.