Sunday, January 19, 2025
Homeసినిమాఇలాంటి పుకార్లు నాకేం కొత్త కాదే: రవితేజ 

ఇలాంటి పుకార్లు నాకేం కొత్త కాదే: రవితేజ 

రవితేజ .. కథను పరుగెత్తించే హీరో. ఆయన ఏ సన్నివేశంలో ఉన్నా ఆ సన్నివేశం పేలవంగా అనిపించదు .. కనిపించదు.  తెరపై తాను కనిపిస్తున్నంత సేపు ఆడియన్స్ కూడా మంచి ఎనర్జీతో ఉండేలా ఆయన చూసుకుంటాడు. ఇప్పటికీ  ఆయన సినిమాలు రికార్డుస్థాయి వసూళ్లను సాధించడానికి ఆ ఎనర్జీనే కారణం. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి ‘రామారావు ఆన్ డ్యూటీ’ రెడీ అవుతోంది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఈ నెల  29వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో రవితేజ బిజీగా ఉన్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. ” శరత్ మండవ ఈ కథను నాకు వినిపించగానే నేను ఓకే చెప్పేశాను. ఆయన సోది చెప్పకుండా .. నస పెట్టకుండా చాలా క్లారిటీతో చెప్పాడు. మొదటి నుంచి కూడా నాకు నాన్చడం ఇష్టం ఉండదు. అవేమి లేకుండా శరత్ చెప్పడం వల్లనే వెంటనే ఒప్పుకున్నాను. రామారావు పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు నచ్చింది. సబ్ కలెక్టర్ పాత్రలో ఇంతవరకూ నేను చేయలేదు .. ఇదే ఫస్టు టైమ్.

ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఆలోచన దర్శకుడిదే. వేణు తొట్టెంపూడితో పోలీస్ ఆఫీసర్ పాత్రను చేయించాలనే ఆలోచన కూడా ఆయనదే. వేణు మళ్లీ బిజీ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ఎక్కువ ఎంటర్టైన్ మెంట్ ఆయన పాత్ర నుంచే ఉంటుంది. తను చాలా బాగా చేశాడు. ఇక హీరోయిన్స్ ఇద్దరికీ కూడా మంచి పాత్రలు పడ్డాయి. ఇద్దరూ కూడా గొప్పగా చేశారు. ఆడియన్స్ ఆశించే సందడి వాళ్ల నుంచి దొరుకుతుంది. సామ్ సీ ఎస్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది .. అందులో ఎలాంటి సందేహం లేదు.

ఇక నాకు .. ఈ సినిమా నిర్మాత సుధాకర్ గారికి రెమ్యునరేషన్ విషయంలో మనస్పర్థలు వచ్చాయనేది  కేవలం ప్రచారం మాత్రమే. పనీ పాటా లేని బ్యాచ్ లు కొన్ని ఉంటాయి .. వాళ్లు చేసే పని ఇది. ఇలాంటి పుకార్లు రావడం ఇప్పుడు కొత్తేమి కాదు .. ఇంతకుముందు కూడా వచ్చాయి. అలాంటప్పుడు నేను నవ్వుకుంటాను అంతే. సుధాకర్ గారు చాలా మంచి మనిషి. నాతోనే కాదు … ఎవరితోనూ ఆయనకి గొడవలు  వచ్చే అవకాశం లేదు. కనుక ఇలాంటి పుకార్లను గురించి పట్టించుకోవలసిన అవసరం ఎంతమాత్రం లేదు” అంటూ  చెప్పుకొచ్చాడు.

Also Read : రవితేజ అభిమానుల్లో పెరుగుతున్న అసహనం! 

RELATED ARTICLES

Most Popular

న్యూస్