Sunday, January 19, 2025
Homeసినిమామొత్తానికి రవితేజ హిట్ కొట్టేశాడబ్బా!

మొత్తానికి రవితేజ హిట్ కొట్టేశాడబ్బా!

రవితేజ అంటే ఊరమాస్ కథలకు కేరఆఫ్ అడ్రెస్. మాస్ మహారాజ్ అనే తన బిరుదుకు తగినట్టుగానే తన సినిమాల్లో మాస్ పాటలు .. డైలాగులు .. డాన్సులు ఉండేలా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఏడాదికి మూడు సినిమాలు తన నుంచి వెళ్లాలనే ఒక సిద్ధాంతాన్ని పక్కాగా అమలు జరపడం కోసం ఆయన చాలా కష్టపడతాడు. అందువలన నాన్చడం అనే లక్షణం ఆయనలో కాగడా పట్టుకుని వెతికినా కనిపించదు. ఆ స్పీడ్ తోనే ఈ ఏడాది కూడా మూడు సినిమాలను థియేటర్లకు వదిలేశాడు.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘ఖిలాడి‘ .. మధ్యలో వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలు ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగినవే. అయితే రవితేజ సినిమా నుంచి ఆడియన్స్ ఆశించే పాళ్లు తగ్గడం వలన, అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే రవితేజ ఈ ఏడాదిలో తన మూడో సినిమాగా ‘ధమాకా’ వదిలాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన థియేటర్లకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమా సక్సెస్ టాక్ ను తెచ్చుకుంది.

ఈ సినిమాలోని ఒకటి రెండు సన్నివేశాలు కథ పేలవంగా .. కాస్త అతిగా అనిపించినా, రవితేజ చేసిన మాస్ గారడీ జనాలకు నచ్చేసింది. ముఖ్యంగా పాటలు .. డాన్సులు జనాలకు విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. రవితేజ నుంచి ఆశించిన ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా లభించింది. అందువల్లనే తొలి 3 రోజుల్లోనే ఈ సినిమా వసూళ్లు 30 కోట్లను దాటిపోయాయి. ఈ సందర్భంగా ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్పడానికి ఈ నెల 29వ తేదీన హైదరాబాదులోని జేఆర్సీ కన్వెన్షన్ లో ‘మాస్ మీట్’ ను కూడా నిర్వహిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్