రవితేజ కెరియర్ ను గమనిస్తే, జయాపజయలను గురించి ఆయన పెద్దగా పట్టించుకోకపోవడం కనిపిస్తుంది. తన వరకూ ఆయన వరుస సినిమాలు చేస్తూ వెళుతుంటారు. ఏడాదికి మూడు సినిమాలను థియేటర్లకు పంపించాలనే ఒక బలమైన నిర్ణయాన్ని ఆయన ఆచరణలో పెడుతున్నారు. చాలా తక్కువసార్లు మాత్రమే ఈ ప్లానింగ్ దెబ్బతింది. క్రితం ఏడాది కూడా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన, ఈ ఏడాది ఫిబ్రవరిలో ‘ఈగల్’తో బాక్సాఫీస్ ను టచ్ చేశారు.
ఈ ఏడాది ఆయన నుంచి రెండో సినిమాగా ప్రేక్షకులను పలకరించడానికి ‘మిస్టర్ బచ్చన్’ రెడీ అవుతోంది. పవన్ కల్యాణ్ సినిమా కోసం చాలా కాలంగా వెయిట్ చేస్తూ వచ్చిన హరీశ్ శంకర్, చాలా వేగంగా రూపొందించిన సినిమా ఇది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించిన ఈ సినిమాపై, ఇటు యూత్ లోను .. అటు మాస్ ఆడియన్స్ లోను క్రేజ్ ఉంది. ఆగస్టు 15వ తేదీన భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇక ఆ తరువాత సినిమాను భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆ మధ్య సూపర్ హిట్ గా నిలిచిన ‘సామజవరగమన’ సినిమాకి రచయితగా పనిచేసిన భాను భోగవరపు, ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. ఈ సారి సంక్రాంతి బరిలో చిరంజీవి .. వెంకటేశ్ సినిమాలు ఉన్నాయి. కోలీవుడ్ స్టార్ సూర్య సినిమా కూడా పండగకు రానుంది. ఈ నేపథ్యంలో రవితేజ కూడా సంక్రాంతి పండుగకే రావాలనుకోవడం విశేషం. ఈ సారి పోటీ ఏ రేంజ్ లో నడుస్తుందో చూడాలి మరి.