రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఇవాళ దీనిపై ప్రకటన చేశారు. ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆయన వెల్లడించారు. రెపో రేటును 6.5 శాతంగానే కొనసాగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వరుసగా మూడోసారి ఇదే రేటు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కూరగాయల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం రేటు పెరగనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రెపో రేటును యధాతథంగా ఉంచడానికి ఆర్బీఐ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు.
ప్రపంచ మార్కెట్లలో ఒడిదిడుకులు ఉన్నా.. భారతీయ ఆర్ధిక వ్యవస్థ మాత్రం స్థిరంగా బలపడుతోందన్నారు. భారత మార్కెట్లు 15 శాతం ప్రపంచ ప్రగతికి తోడ్పుడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం మార్కెట్ ప్రపంచంలో జరుగుతున్న మార్పుల వల్ల భారత్ లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణ రేటు 5.1 శాతం నుంచి 5.4 శాతానికి పెరగనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ అంచనా వేశారు. మే నెలలో 4.3 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణ రేటు.. జూన్ నెలలో 4.8 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఆ రేటు మరింత పెరిగే ఛాన్సు ఉందని శక్తికాంత్ తెలిపారు.