రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. హోం గ్రౌండ్ బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై 27పరుగులతో విజయం సాధించి టైటిల్ రేసులో నిలిచింది. ఆర్సీబీ ఈ సీజన్ లో ఆడిన మొదటి ఎనిమిది మ్యాచ్ లలో కేవలం ఒకటి మాత్రమే గెలిచినా…. చివరి ఆరు మ్యాచ్ లూ విజయం సాధించి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సూపర్ 4లో బెర్త్ ఖాయం చేసుకుంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగుళూరు 218 పరుగులు చేయగా… ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే 201 పరుగులు చేయాల్సిన చెన్నై పది పరుగుల దూరంలో ఆగిపోయి 191 మాత్రమే చేసింది. యష్ దయాళ్ వేసిన చివరి ఓవర్లో చెన్నై కు ప్లే ఆఫ్ఫ్ కోసం 17 రన్స్ కావాల్సి ఉండగా తొలి బంతిని స్టాండ్స్ లోకి పంపిన ధోనీ ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. గత ఐపీఎల్ ఫైనల్లో మాదిరిగా నేడు కూడా చివరి ఓవర్లో జడేజా మేజిక్ చేస్తాడనుకున్న చెన్నై అభిమానులకు నిరాశే మిగిలింది.
బెంగుళూరు ఓపెనర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ తొలి వికెట్ కు 78 పరుగులు చేశారు. మూడు ఓవర్లలో 31 పరుగులు చేసిన దశలో వర్షం కురిసి అందరినీ ఆందోళనకు గురి చేసినా 20 నిమిషాల వ్యవధిలోనే మళ్ళీ ఆట మొదలు కావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
- కోహ్లీ 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 47
- ఫాప్ 39 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54
- రజత్ పటీదార్ 23 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41
- దినేష్ కార్తీక్ 6 బంతుల్లో 1 ఫర్, 1 సిక్సర్ తో 14
- మాక్స్ వెల్ 5 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్సర్ తో 16 పరుగులు చేసి ఔట్ కాగా
- కామెరూన్ గ్రీన్ 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 218 రన్స్ సాధించింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, తుషార్ దేశ్ పాండే, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు.
చెన్నై… ఇన్నింగ్ తొలి బంతికే మాక్స్ వెల్ బౌలింగ్ లో కెప్టెన్ రుతురాజ్ వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. మూడో ఓవర్లో డెరిల్ మిచెల్ (4) కూడా వెనుదిరిగాడు. రచిన్ రవీంద్ర 37 బంతుల్లో 5 ఫోర్లు,3 సిక్సర్లతో 61; రెహానే 33 పరుగులతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా…. శివమ్ దూబె(7); శాంట్నర్(3)లు విఫలమయ్యారు. చివర్లో జడేజా-ధోనీ కీలక భాగస్వామ్యం నమోదు చేసినా ఓటమి తప్పలేదు. ధోనీ 13 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్ తో 25 చేసి ఔట్ కాగా, జడేజా 22 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 20 ఓవర్లు పూర్తయ్యే నాటికి 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేయగలిగింది. బెంగుళూరు బౌలర్లలో యష్ దయాళ్ 2; మాక్స్ వెల్, సిరాజ్, ఫెర్గ్యూసన్, గ్రీన్ తలా ఒక వికెట్ సాధించారు.
బెంగుళూరు కెప్టెన్ డూప్లెసిస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించింది.