కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ పార్టీ నేత హెచ్‌డీ కుమారస్వామి ఆసుపత్రిలో చేరారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం వైద్యులు కుమారస్వామికి ట్రీట్ మెంట్ చేస్తున్నారు. అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
గత కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాల్లో తీరిక లేకుండా గడిపిన ఆయనకు ఒళ్లు నొప్పులతో పాటు జ్వరం కూడా వచ్చినట్లు తెలుస్తోంది. గత వారం రోజులనుంచి ఆయన పలు మీటింగుల్లో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కోలార్ జిల్లా పర్యటకు వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. తీరికలేని పని వల్లనే ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇటీవలే కుమార స్వామికి గుండె సంబంధిత ఆపరేషన్ కూడా జరిగింది. దీంతో కుటుంసభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు గురవుతున్నారు.