Sunday, September 8, 2024
HomeTrending NewsUPSC పరీక్షల్లో మార్పులకు శ్రీకారం

UPSC పరీక్షల్లో మార్పులకు శ్రీకారం

ట్రైనీ ఐఏఎస్ పూజ ఖేడ్కర్ వ్యవహారం…UPSC ఛైర్మన్‌ మనోజ్ సోనీ రాజీనామా వ్యవహారం చర్చనీయంశంగా మారింది. మనోజ్ సోనీ పదవీకాలం 2029 వరకు ఉండగా… ఐదేళ్ల ముందు పదవికి రాజీనామా చేయడం అనంతకోటి చర్చలకు దారితీసింది. దీంతో యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (U.P.S.C) పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణకు పూనుకుంది.

పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పోటీ పరీక్షల నిర్వహణలో అధునాతన డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ అథెంటికేషన్‌, ఫింగర్‌ప్రింట్ తీసుకోవడం, ఫేషియల్ రికగ్నిషన్‌ వంటి చర్యలతో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని యోచిస్తోంది.

సీసీ కెమెరాలతో నిఘా… అందుకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ వినియోగించడం, ఈ-అడ్మిట్ కార్డ్‌లపై QR కోడ్ స్కానింగ్ వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. పరీక్షల సమయంలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది.

యూపీఎస్సీ (UPSC) ఏటా 14 పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్ కూడా ఉంది. వీటితో పాటు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలకు శాఖల వారిగా పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో సాంకేతిక సేవలను అందించేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను బిడ్స్‌కు ఆహ్వానిస్తూ టెండర్‌ దాఖలు చేసింది. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో పరీక్షల ఆధారిత ప్రాజెక్టుల ద్వారా కనీసం రూ.100 కోట్లు సగటు టర్నోవర్‌ కలిగి ఉన్న సంస్థలు మాత్రమే బిడ్‌ వేయాలని టెండర్‌లో యూపీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌, ఎగ్జామ్‌ సెంటర్ల జాబితా, ఎంతమంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారు వంటి వివరాలను పరీక్షకు రెండు, మూడు వారాల ముందు సర్వీస్‌ ప్రొవైడర్లకు అందజేస్తామని పేర్కొంది.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్