Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఉగ్గుపాల పొత్తిళ్లు

ఉగ్గుపాల పొత్తిళ్లు

My Party- My Wish:
విలేఖరి:-

సార్! అకస్మాత్తుగా ఈశాన్య రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు! మొన్నటివరకు ఎక్కడా పోటీ చేయం అన్నారు?

నాయకుడు:-
భావసారూప్యంగల పార్టీలు కలసి వస్తే పొత్తులకు వెళ్దామనుకున్నాం. ఈలోపు ఈశాన్యంలో మాకు ఒంటరిగానే బలం పెరుగుతుందని మా ఆస్థాన వాస్తు విద్వాంసుడు పసిగట్టారు. దాంతో విశాల ప్రజాస్వామిక శక్తుల పునరేకీకరణ సూత్రాన్ని ఈసారికి పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేస్తాం.

వి:-
మరి ఇక్కడ ఇప్పుడు మీరు ఎవరితో పొత్తులో ఉన్నట్లు? ఎవరితో లేనట్లు?

నా:-
మొదట పొత్తులో ఉన్న పార్టీ మొక్కజొన్న పొత్తులు తింటూ…మేము వెళ్ళినప్పుడు కూడా పొత్తులే తినాలంటూ బలవంతపెడుతోంది…

వి:-
అంటే…విడాకులు ఇచ్చినట్లేనా?

నా:-
మేము వెండి కంచాలు వాడతాం. ఆకులు విడి కావడానికి ఆస్కారమే లేదు.

వి:-
మరి కొత్తగా కంచంలో ఇంకేదో ఉడకబెట్టిన పొత్తు వచ్చి చేరినట్లుంది.

నా:-
అవును…మా సంకీర్ణ ప్రభుత్వమే వచ్చేది.

వి:-
ఎవరు ముఖ్యమంత్రి అవుతారు?

నా:-
నేను ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి సిద్ధం. బట్టలు కూడా కుట్టించుకున్నాను. అయితే సి ఎం పోస్ట్ నాకు చాలా చిన్నది అని నా వ్యక్తిగత అభిప్రాయం. నేను వెంపర్లాడే వ్యక్తిని కాను.

వి:-
మరి…ప్రధాని పదవి సరిపోతుందా? అది కూడా చిన్నదవుతుందా?

నా:-
పదవి నాకు గడ్డిపోచ. అభిమానులకు పంచ్ డైలాగులే నాకు ముఖ్యం. దానికోసం మా వ్యూహాలు మాకుంటాయి. రాత్రిళ్లు పుస్తకాలు ఎక్కువ చదవడం వల్ల…పొద్దునకు పంచ్ డైలాగులు పరస్పరం సంఘర్షించుకుంటున్నాయి. అంతే. పొత్తిళ్లలోనే నేను పొత్తుల విద్యలను ఉగ్గుపాలతో నేర్చుకున్నాను. పుట్టుకతో వచ్చింది పుడకలతో అయినా పోతుందా?

వి:-
పల్లకి మోసే బోయీగా మీకు బాగా అలవాటయ్యింది కానీ…పల్లకీ ఎక్కే ప్రణాళిక ఉన్నట్లు లేదు!

నా:-
బోయీగా పనిచేసేంత బలమే నాకుందేమో! అంతకుమించి శక్తి నాకు లేదేమో! అయినా సీ ఎం పోస్ట్ ఇస్తానంటే తీసుకోవడానికి నేనేమీ వ్యతిరేకం కాదు.

వి:-
మొదటి పొత్తుతోనా? రెండో పొత్తుతోనా? మొదటిది వదిలి రెండోదానితోనా? రెండిటితోనా ?

నా:-
మా వ్యూహాలు మాకుంటాయి. ఆగ్నేయ నైరుతి రాష్ట్రాల్లో ఈసారి ఎగిరేది మా జెండానే. ఎర్రకోట మీద ఈసారి జెండా ఎగరేసేది ప్రధానమంత్రే. రాసి పెట్టుకోండి…ఆరు నూరయినా రేపు సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు.

వి:-
నేను తాళ్లగడ్డ నుండి ఈ ప్రెస్ మీట్ కు వచ్చాను. మీరు వదిలిపెడితే వెనక్కు తిరిగి చూడకుండా ఎర్రగడ్డకు వెళతాను.

నా:-
అలాగే. అవశ్యం. మధ్యలో ఆకలయితే ఈ కాల్చిన పొత్తు తినండి. ఇదిగో.

వి:-
అలాగే. ఇలా ఇవ్వండి. ఆచేత్తోనే రెండు ఎరగడ్డలు కూడా ఇవ్వగలరా?
అకటా!
వికటపు విగ్రహం! చెబితే వినడు- తిడితే ఏడుస్తాడు.
ఏమి నా దుర్భాగ్యము!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్