Railway Gender: ఇలాంటి సమస్యలొస్తాయని తెలిసే చిన్నయసూరి ఎన్నో వ్యయప్రయాసలకోర్చి బాల వ్యాకరణం రాసి పెట్టాడు. ఆయన రాసిన నాటికి అది పిల్లలు తప్పనిసరిగా చదివి అర్థం చేసుకోవాల్సిన వ్యాకరణ గ్రంథం. ఆ తరువాతి మెట్టుగా తెలుగులో అత్యంత ప్రామాణికమయిన శబ్ద రత్నాకరం నిఘంటు నిర్మాత బహుజనపల్లి సీతారామాచార్యులు ప్రౌఢ వ్యాకరణం రాశారు. చిన్నయసూరి వ్యాకరణ సూత్రాలు తెలుసుకోకుండా…బహుజనపల్లి ప్రౌఢ వ్యాకరణం వినకుండా…చదువులన్నీ చదివి, పెరిగి, పెద్దయి, బతికి, బట్టకట్టే తెలుగు జాతి ఇప్పుడు వెలుగుతోంది కాబట్టి…ఇలాంటి సమస్యలే వస్తాయి.
రాసేప్పుడు, మాట్లాడేప్పుడు వాక్యంలో కర్త- కర్మ-క్రియ అన్వయం ఉండి తీరాలి. చదువురాని వారయినా వారి మాతృభాషలో మాట్లాడేప్పుడు సహజంగా ఈ నియమాన్ని పాటిస్తారు. అప్పుడప్పుడే మాటలు నేర్చుకునే పసి పిల్లలు ఈ నియమాన్ని పట్టించుకోకుండా మాట్లాడితే ముద్దు ముద్దుగా ఉంటుంది. పెద్దలు మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది.
ఎంత చిన్న వాక్యమయినా లింగ వచన భేదాలు పాటించి తీరాల్సిందే.
ఇంట్లో మీ అమ్మ ఉన్నాడా?
ఇంట్లో మీ నాన్న ఉందా?
ఇంట్లో మీ కుక్క ఉన్నారా?
ఇంట్లో మీ బంధువులు ఉన్నాడా?
ఇంట్లో మీ బంధువులు ఉందా?
ఈ వాక్యాల్లో తప్పేమిటో చెప్పాల్సిన పని లేదు. లింగ, వచనాన్ని బట్టి క్రియాపదం మారిపోతూ ఉంటుంది. కొందరు బయట పిచ్చాపాటీ మాటల్లో ఈ వ్యాకరణ సూత్రాలేవీ తెలియకపోయినా అత్యంత వ్యాకరణబద్దంగా మాట్లాడుతూ…వేదికల మీదకానీ, కెమెరాల ముందుగానీ మాట్లాడేప్పుడు కృతకమయిన భాషతో, కర్త కర్మ క్రియ అన్వయం లేకుండా వ్యాకరణ విరుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు. స్టేజ్ ఫియర్ ఒక కారణం. ఆవేశంగా మాట్లాడ్డంలో అన్వయం దారితప్పడం సహజం.
సంస్కృతంలో శబ్దాన్ని బట్టి లింగ భేదం వస్తుంది.
భార్యా
దారాః
కళత్రం- మూడు మాటల అర్థం ఒకటే అయినా ఒకటి స్త్రీలింగం; ఒకటి పుంలింగం; ఒకటి నపుంసకలింగం. తెలుగులో వాచకాన్ని బట్టి లింగభేదం వస్తుంది.
చిన్నప్పుడు ఐదేళ్లలోపు మాట్లాడే మాతృభాషకు సంబంధించిన వ్యాకరణ సూత్రాలన్నీ మెదడులో ప్రోగ్రామింగ్ అయిపోతాయి. తరువాత దేన్నయినా ఆ ప్రోగ్రామింగ్ ఆధారంగానే మెదడు విశ్లేషించుకుంటూ ఉంటుంది. ఎంత పెద్ద వాక్యాన్నయినా ఆ ప్రాగ్రామింగ్ ఆధారంగానే పలుకుతుంది. పి వి నరసింహారావు, పుట్టపర్తి నారాయణాచార్యుల వంటివారు పదికి పైగా భాషలు అలవోకగా మాట్లాడినా వారికయినా మొదట ప్రోగ్రామింగ్ అయ్యింది మాత్రం మాట్లాడే తెలుగు సహజ సూత్రాలే. సాధనతో, కృషితో, నిరంతర అధ్యయనంతో, ఆయా భాషలవారితో మాట్లాడుతూ వారు మిగతా భాషల్లో కూడా అనితరసాధ్యమయిన పట్టు సాధించారు.
ప్రవహించేదే భాష అని ఒక నిర్వచనం కూడా ఉంది. పరస్పర ఆదానప్రదానాలతో భాష విస్తరిస్తూనే ఉంటుంది. ఇతర భాషల పదాలను కలుపుకుంటూ శాఖోపశాఖలుగా విస్తరిస్తూ ఉంటుంది. నూటికి తొంభై శాతం ఇంగ్లీషు లేదా ఇతర భాషల పదాలే ఉన్నా…చివర క్రియాపదం తెలుగులో ఉంటే…అదంతా తెలుగే అయిపోతోంది.
కరెంట్ బిల్ వచ్చింది.
సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లేట్ గా వచ్చింది.
సెక్యూరిటీ చెక్ కంప్లిట్ అయి బోర్డింగ్ కు రెడీగా ఉన్నాను.
ఐ టీ రైట్సర్న్స్ ఫైల్ చేయాలి.
మనం సాధారణంగా మాట్లాడే మాటల్లో క్రియాపదం తప్ప మిగతాదంతా తెలుగు కానే కాదని చెప్పినా ఇప్పుడెవరూ ఒప్పుకోరు.
ఇంతగా తెలుగు మాసిపోయి క్రియాపదం ఒంటికాలిమీద నిలబడ్డా సంతోషించాల్సిన విషయం…లింగ వచన విభక్తులు పాటిస్తుండడం. ఆన్ లైన్ పోర్టల్, యాప్ ఆధారిత సేవలు అందుబాటులోకి వచ్చాక…మనం బతికి ఉంటే బతికి ఉన్నట్లు ఆ పోర్టల్స్ కు ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉండాలి. పొతే ఎందుకు పోయమో…పోయాక కూడా విన్నవించుకోవాలి. కొన్ని కాలమ్స్ లో ఏదో ఒకటి నింపకపోతే బండి కదలదు.
అలా…తెలంగాణ ప్రభుత్వ ధరణి పోర్టల్లో ఒకానొక కాలం నింపలేక భారతీయ రైల్వే తలపట్టుకుని కూర్చుంది. వరంగల్ ఖాజీపేట దగ్గర రైల్వే వర్క్ షాపు కోసం భూమిని బదిలీ చేయాలి. అలా బదిలీ చేయడానికి ఇప్పుడు ధరణి పోర్టల్ ఒక్కటే మార్గం. అందులో రైల్వేకు తండ్రి పేరు లేదా భర్త పేరు; పుట్టిన తేది, మేల్/ఫీ మేల్ ఆడా/ మగ టైప్ చేస్తేగానీ ధరణి ముందుకు కదలదు.
యంత్రాన్ని ఎగతాళి చేస్తాం కానీ…పాపం అది ఎంతో లోతయిన ప్రశ్నలను మన ముందు ఉంచింది. సమాధానం చెప్పండని మన వెంట పడుతోంది.
నిజమే…
భారతీయ రైల్వే ఇప్పుడు ఆడా కాదు. మగా కాదు.
తండ్రి ఉన్నా…అనాథ.
భర్త ఉన్నా…ఉపయోగం లేదు.
చిన్నయసూరి సూత్రం-
“స్త్రీ తిర్యగ్జడ భిన్నంబులును వాని విశేషణంబులును మహత్తులనంబడు”
ప్రకారం రైల్వే ఆడ కాదు…మగ కాదు… నపుంసక లింగం అని తల్లి ధరణికి చెప్పేవారెవరు!!
అయ్యో రైల్వే…
ఆడా కాక…ఈడా కాక…యాడ చిక్కుకుంటివే? స్త్రీ/పురుషుడు పక్కన సంస్థ అన్న ఒక్క మాటలేక
యాడాడో చిక్కుకున్న ఖాజీపేట రైల్వేను విడిపించి…లింగవచన విభక్తి వ్యాకరణ పట్టాలెక్కించడానికి ఏ చిన్నయసూరి పుట్టాలిప్పుడు?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read : యంత్రోపన్యాసం