రాజకీయాల్లో బంధుప్రీతిపై పరస్పర ఆరోపణలు చేసుకునే నేతలు ఆచరణలో మాత్రం పాటించటం లేదు. కుటుంబ రాజకీయాలు, కుల రాజకీయాలు అని విమర్శలు చేయటం అలవాటుగా మారింది. ఎన్నికల్లో టికెట్లు ఇచ్చే సమయానికి గెలుపు గుర్రాలకే అవకాశాలని కొత్త వాదన తీసుకొచ్చి…ఐన వారికే అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారు.
శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు కుటుంబ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు అని పొల్లు పొల్లు తిట్టుకున్నరు. తెలంగాణలో ఉన్నదే 119 అసెంబ్లీ స్థానాలయితే అందులో 17 మంది దాక బంధుగణమే గెలిచి వచ్చారు. ఈ దఫా శాసనసభలో బంధువులు, కుటుంబ సభ్యులు తదితర రక్తసంబంధీకులు ఎమ్మెల్యేలుగా వచ్చారు.
ఎమ్మెల్యే కెసిఆర్ గజ్వేల్ నుంచి, కుమారుడు ఎమ్మెల్యే కేటిఆర్ సిరిసిల్ల నుంచి, అల్లుడు ఎమ్మెల్యే హరీష్ రావు సిద్ధిపేట నుంచి గెలిచి శాసనసభలో కొనసాగుతున్నారు. కెసిఆర్ తోడల్లుడి కుమారుడు సంతోష్ రావు రాజ్యసభ ఎంపిగా, కెసిఆర్ కుమార్తె కవిత ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కవిత మినహా మిగతా వారు మంత్రి పదవులు కూడా అలంకరించారు. కుటుంబ సభ్యులకే ఇచ్చారు అని విపక్ష నేతలు విమర్శలు చేస్తే సమర్థత ప్రకారమే పదవులు దక్కుతాయని…చుట్టరికాలు పనిచేయవని ఎన్నోసార్లు కేటిఆర్ సమర్థించుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్, చెన్నూర్ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి శాసనసభ్యులుగా ఈ సభలో అడుగు పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత గతంలో పెద్దపల్లి ఎంపి, కేంద్రమంత్రిగా బాద్యతలు నిర్వహించిన గుడిసెల వెంకటస్వామి కుమారులు కావటం గమనార్హం. ముధోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి నారాయణరావు పటేల్, బిజెపి నుంచి రామారావు పటేల్ అన్నదమ్ములు తలపడ్డారు. అన్న ఓడిపోగా తమ్ముడు గెలిచారు.
మేడ్చల్ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి మల్లారెడ్డి గెలవగా మల్కాజ్ గిరి నుంచి ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్ రావు తనకు, తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని కోరటం… బీఆర్ఎస్ నాయకత్వం నిరాకరించటం..వెన్వెంటనే కాంగ్రెస్ లో చేరి ఇద్దరికి దక్కించుకున్నారు. దీంతో మల్కాజ్ గిరి స్థానం బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశేఖర్ కు వచ్చింది. హన్మంత రావు ఓడిపోగా ఆయన కుమారుడు రోహిత్ మెదక్ నుంచి విజయం సాధించారు. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పేరులోని రెండు పేర్లతో ఉన్న రెండు స్థానాలు ఒకే కుటంబానికి దక్కటం ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి సోదరులు ఎమ్మెల్యేలుగా వచ్చారు. గతంలో వెంకట్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండగా రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపిగా ప్రాతినిధ్యం వహించారు. ఇక హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి పద్మావతి దంపతులు చట్టసభల్లోకి రెండో దఫా కలిసి అడుగుపెడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచిన చిట్టెం పర్నికా రెడ్డి దగ్గరి బంధువులు. బిజెపి నేత డీకే అరుణ భర్త భరత సింహ రెడ్డి మేనల్లుడు కృష్ణమోహన్ రెడ్డి కాగా డీకే అరుణ మేనకోడలు చిట్టెం పర్నికా రెడ్డి కావటం గమనార్హం. శాసనసభ ఎన్నికల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. ఆయన మీద ఎమ్మెల్యేగా పోటీ చేయమని డీకే అరుణను పార్టీ నాయకత్వం కోరినా ఆమె ససేమిరా అన్నారు. దగ్గరి బంధువు కావటం వల్లే డీకే అరుణ పోటీ చేయలేదని నియోజకవర్గంలో గుస గుసలు వినిపిస్తున్నాయి.
నాగర్ కర్నూల్ నుంచి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి శాసనసభలో మొదటిసారి అడుగుపెడుతుండగా ఆయన తండ్రి కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నారు. కుమారుడికి పార్టీ టికెట్ నిరాకరించటంతో కాంగ్రెస్ లో కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి జంప్ అయ్యారు. వనపర్తిలో గెలిచిన మేఘారెడ్డి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి సమీప బంధువు. ఆ మాటకొస్తే మేఘారెడ్డిని రాజకీయాల్లో ప్రోత్సహించిందే నిరంజన్ రెడ్డి.
పాలమూరు జిల్లాలో గెలిచిన, ఓడిన రెడ్డి సామాజికవర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఎదోవిధమైన దగ్గర, దూరపు బంధుత్వాలు ఉన్నాయి. అందుకే ఈ జిల్లాకు ఓ పేరుంది. ప్రఖ్యాత పిల్లలమర్రి మహావృక్షం ఉన్న పాలమూరు జిల్లాల్లో కాపుల మర్రి రాజకీయాలు బలమైనవని అంటారు.
చట్టసభల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యం దక్కని సామాజిక వర్గాలు చాలా ఉన్నాయి. చైతన్యవంతులైన ఓటర్లు ఉన్న ప్రాంతాల్లోనే ఈ విధంగా ఉంటే ఉత్తరాది రాష్ట్రాలు ఇందుకు భిన్నం కాదు. అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంతో పార్టీలు మేనిఫెస్టోలు రూపొందిస్తున్నా ఆచరణలో ఆదర్శాలు ఆటకెక్కుతున్నాయి. రాజ్యంగపరమైన పదవులు, సభల్లో మాత్రం అంగ, అర్థబలం ఉన్నవారికి బంధుగణానికి చోటు దక్కుతోంది.
చట్టాలు తయారు చేసే రాజ్యాంగ సభలకు చుట్టాలు రావటం హక్కుగా మారుతోంది. మాజీ నేత, దిగంగత నేత కుమార్తె, కుమారుడికి ఇవ్వాలని కోరటం… అందుకు ప్రజలు మద్దతు పలికినంత కాలం ప్రతిభకు పట్టం కట్టడం అసాధ్యం.
-దేశవేని భాస్కర్