కడపజిల్లా సింహాద్రిపురం దగ్గర కోరుగుంటపల్లెలో సంపన్న కుటుంబంలో శ్రీనాథ్ పుట్టాడు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఒకే కొడుకు. ఎస్వీ యూనివర్సిటీలో ఆంగ్ల సాహిత్యంలో పీ జీ చేశాడు. 1978లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో చేరాడు. కడప రిపోర్టర్ గా దాదాపు 30 ఏళ్లు, ఆ తరువాత కొంతకాలం హైదరాబాద్ లో పనిచేశాడు. ఇదే అయితే అసలు చెప్పాల్సిన పనిలేదు. ప్రతివారూ ఏదో ఒక డిగ్రీ చేస్తారు, ఏదో ఒక ఉద్యోగం చేస్తారు. రిటైర్ అవుతారు.
రెండు దశాబ్దాలపాటు కడప శ్రీనాథ్ రెడ్డి ఆఫీసే రాయలసీమ ఉద్యమానికి కేరాఫ్ అడ్రెస్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మైసూరా రెడ్డి, జేసి దివాకర్ రెడ్డి మొదలు రాయలసీమ ఉద్యమంతో ముడిపడిన అందరి తలలో నాలుక శ్రీనాథ్. ఇంగ్లీషు, తెలుగులో ఒకే వేగంతో ప్రతిపదం అర్థవంతంగా రాయడం శ్రీనాథ్ ప్రత్యేకత. కడపలో సెవెన్ రోడ్స్ ఒక కూడలి పేరు. సెవెన్ రోడ్స్ పేరుతో ప్రతి బుధవారం ప్రభలో వచ్చే శ్రీనాథ్ కాలం కోసం పాఠకులు ఎదురుచూసేవారు. నడకలో, మాటలో ఏదో ధిక్కారమో నిర్లక్ష్యమో కనిపిస్తుంది. చాలా రోజులు నాకది అహంకారంగా కనిపించేది. కాస్త పరిచయం పెరిగాక అతడికి ధిక్కారం కవచకుండలం అని మనకర్థమవుతుంది. జీతం మీద బతకాల్సిన అవసరంలేని మనిషి. కడపలో ఆంధ్రప్రభను ఒకరకంగా ఆయనే పోషించాడు. ఒక జర్నలిస్టు అలా సొంత జీపులో, వెంట సినిమాల్లోలా అనుచరులతో చూడ్డానికి నాకు మొదట అసూయగా ఉండేది, తరువాత కనులపండుగగా మారింది. డొక్కు సైకిల్ మీద తిరుగుతూ ప్రింట్ అయిన వార్తలను సెంటీ మీటర్లలో కొలిచి, సెంటీ మీటర్ కు రూపాయి చొప్పున చెల్లిస్తే నెలకు ఆరేడు వందలు సంపాదించే నాలాంటి జర్నలిస్టులకు శ్రీనాథ్ అప్పటికే రూపర్ట్ మర్డోక్ లా కనిపించేవాడు. ఏదీ రాసుకోడు, కానీ వార్త రాసేప్పుడు ఏదీ మిస్ కాడు. ఏమీ చూడనట్లుంటాడు, చూసినదాన్ని మనం చూడని కోణంలో రాస్తాడు. ప్రెస్ మీట్లకు ముందు ఏమి మాట్లాడాలో శ్రీనాథ్ ను అడిగి అదే అప్పజెప్పి – అన్నా సరిగ్గా చెప్పినానా ? అని ఆయన్నే అడిగి వెళ్లేవారు. ఏందన్నా, నీ సీక్రెట్ వణికిపోతారు, నీతో మాట్లాడ్డానికి? అంటే సమాధానం ఉండదు. నవ్వుతాడు. అతడు అనేక యుద్ధముల ఆరితేరినవాడు. ఇప్పటి తరం జర్నలిస్టులకు శ్రీనాథ్ అనగానెవరు? ఆయన పోస్టులకు వచ్చిన లైక్ లు ఎన్ని? చిట్టి ట్విట్టరు, ఫేసు బుక్ గోడ మీద లేని శ్రీనాథ్ ను జర్నలిస్టుగా గుర్తించుట ఎట్లు? యూ ట్యూబులో ఆయన వ్యాఖ్యలు దొరకనప్పుడు ఆయనకు అక్రెడిటేషన్ ఇచ్చుట నేరము కదా? అని అనిపించవచ్చు.
నేను 1989 తొలిసారి ఎన్నికల వార్తలు రాస్తున్న సమయానికి రాయలసీమలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎక్కడెక్కడ ఎంత మెజారిటీలు రావచ్చో చెప్పినవాడు శ్రీనాథ్. శ్రీనాథ్ వచ్చేవరకు ప్రెస్ మీట్లు ఆగేవి. శ్రీనాథ్ వచ్చాక ఒక సెలిబ్రిటీ వచ్చినట్లు వాతావరణం మారిపోయేది. అలా ఒక్కరోజన్నా నాకోసం ప్రెస్ మీట్ ఆగితే వెళ్లి శ్రీనాథ్ అన్న ముందు – చూడన్నా నేను కూడా నీస్థాయికి వచ్చినా – అని చెప్పి కాలర్ ఎగరేద్దామనుకున్నా. కానీ కలంపట్టిన ప్రతివాడూ జర్నలిస్టు కాదు; ఖడ్గం పట్టిన ప్రతివాడూ యోధుడూ కాదు అని జర్నలిజమే నా కాలర్ దించి బయటికి పంపింది.
శ్రీనాథ్ అన్న మృతికి నివాళి.
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
9989090018