Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతెలుగు జర్నలిజానికి పాఠం

తెలుగు జర్నలిజానికి పాఠం

Journalist Varadachari  A Great Journalist: ఎంత సృజనాత్మక కళ అయినా దాన్ని నేర్చుకోవడానికి ప్రామాణికమయిన పాఠాలు ఉండాలి. లేకపోతే ఒక విద్యగా అది లోకానికి అందదు. నేర్చుకున్న విద్యతో పోలిస్తే కోటి రెట్లు మెరుగుగా ప్రదర్శించేవారు ఉండవచ్చు. కానీ నేర్చుకోవడానికి పాఠాలు మాత్రం సులభంగా ఉండాలి. గొప్ప సృజనాత్మక విద్య ఉన్నవారు…వారి విద్యను పాఠంగా ఇతరులకు చెప్పవచ్చు, చెప్పలేకపోవచ్చు. ఒక విద్యలో గొప్పగా పాఠం చెప్పేవారు అదే విద్యను ప్రదర్శించడంలో రాణించవచ్చు, రాణించలేకపోవచ్చు. కోటికొక్కరికి మాత్రమే సృజనాత్మక విద్య, దాన్ని పాఠంగా అంతే అందంగా చెప్పగలిగే నేర్పు రెండూ ఉంటాయి.

తెలుగు జర్నలిజంలో అలాంటి అరుదయిన వ్యక్తి జి. ఎస్. వరదాచారి. ఆయన గురించి రాయడం అంటే…తెలుగు జర్నలిజం గురించి రాయడమే. దాదాపు అరవై ఏళ్లపాటు మీడియాలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆయన మొదట ఇంగ్లీషు దినపత్రికలో కాలు పెట్టి…వెంటనే తెలుగు పత్రికలోకి వచ్చేయడం తెలుగు జర్నలిజం చేసుకున్న అదృష్టం.

ఇంగ్లీషు జర్నలిజం విద్యతో పోలిస్తే తెలుగు జర్నలిజం విద్యకు పుస్తకాలు లేని రోజుల్లోనే…ఆయన ఆ పాఠాలను రూపొందించడం మొదలు పెట్టారు. చివరికి తెలుగు జర్నలిజానికి ఆయనే ఒక పాఠమంత ఎత్తుకు ఎదిగారు.

మనిషి మెత్తన. మాట మరీ మెత్తన. పరుషంగా ఎవరినీ పల్లెత్తు మాట అనరు. నిరంతర విద్యార్థి. జర్నలిస్ట్ ఎంత సరళంగా రాయాలంటే…రాయగలిగిన ఇంకెవ్వరూ దాన్ని ఇక సరళీకరించడానికి వీల్లేనంత సరళంగా రాయాలని పదే పదే చెప్పారు. ఆయన అలాగే రాశారు. అలా ఎలా రాయాలో నేర్పారు. ఆ నేర్పును ఒక పాఠంగా లోకానికి ఇచ్చారు.

సాధారణంగా జర్నలిస్టులు చేసే తప్పులను ఎత్తి చూపారు. అలా చేయకుండా ఉండాలంటే ఏమి చేయాలో చెప్పారు.

Journalist Varadachari

“ఇలాగేనా రాయడం?” అని గురువుగా కోప్పడ్డారు.
(జర్నలిస్టుల రచనల్లో దోషాల మీద ఆయన పుస్తకం- ఇలాగేనా రాయడం?)

తప్పులొక్కటే చెప్పి లాభం లేదు కాబట్టి…ఒప్పులేమిటో చెప్పి “దిద్దుబాటు” చేశారు.
(ఆయన మరో పుస్తకం ‘దిద్దుబాటు’)

అనుభవజ్ఞుడయిన జర్నలిస్ట్ లోకానికి ఎలా ఉపయోగపడగలడో ‘పరిణిత పాత్రికేయం’లో చూపించారు.
(ఆయన ఇంకో పుస్తకం)

మన పాత్రికేయ వెలుగులను వెలుగులోకి తెచ్చారు.
(‘మన పాత్రికేయ వెలుగులు’ ఆయన పుస్తకం పేరు)

సినిమా సమీక్షలు అనగానే బ్రహ్మాండం, భజగోవిందం కాకుండా సినిమా సమీక్షకు ఒక దారిదీపంగా నిలిచారు. ఉత్తమ ఫిలిం జర్నలిస్ట్ అవార్డు అందుకున్నారు.

అనేక యూనివర్సిటీలకు జర్నలిజం పాఠాలు రాసి పెట్టారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగానికి అధిపతిగా పనిచేశారు.

తెలుగు జర్నలిజంలో ఆయన “దిద్దుబాటు” చిన్న కాలిబాట కాదు…పెద్ద దిద్దుబాట.

ఆయన ఏమిటో తెలియాలంటే రచన జర్నలిజం కాలేజీ ముద్రించిన దిద్దుబాటు(ఆయన రాసిన కాలం సంకలన గ్రంథం) పుస్తకం చివరి అట్టమీద ఆయన గురించిన పరిచయం రెండు పేరాలు చదివితే చాలు. అది యథాతథంగా:-

పత్రికా రచనాచార్య వరదాచార్య

“తెలుగు జర్నలిజంలో సాధికార ముద్ర శ్రీ గోవర్ధన సుందర వరదాచారి. ఐదు దశాబ్దాలకు పైబడిన అనుభవంతో తలపండిన పాత్రికేయ యోధుడు ఆయన. పత్రికా చట్టాల గురించి, తెలుగు జర్నలిజం గురించి ఎంత సాధికారికంగా మాట్లాడగలరో, వెండితెర వేల్పుల గురించి, వన్నె చిన్నెల గురించి అంతే సాధికారికంగా విడమరచి చెప్పగలరు. 1956లోనే జర్నలిజంలో డిప్లొమా చేసిన ఆయన న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ముద్దు బిడ్డ అయిన శ్రీ జి. ఎస్. వరదాచారి మృదు భాషి, అయినా తాను నమ్మిన విలువల విషయంలో రాజీపడని  తత్వం ఆయన సొంతం.  ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తట్టుకు నిలబడగల నిబ్బరం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

‘ఆంధ్ర జనత’లో 1956లో సబ్ ఎడిటర్ గా పత్రికా రచన వృత్తికి శ్రీకారం చుట్టారు. ఆంధ్ర భూమిలో న్యూస్ ఎడిటర్ గా పనిచేనిన ఆయన ‘ఈనాడు’లో అసిస్టెంట్ ఎడిటర్ గా కొనసాగి….. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం జర్నలిజం శాఖాధిపతిగా పనిచేశారు. వివిధ యూనివర్సిటీల  జర్నలిజం కోర్టులను తీర్చిదిద్దడంలో ఆయన తన వంతు క్రియాశీల పాత్ర పోషించారు.  వివిధ పత్రికల్లో వందల సంఖ్యలో ఆయన సంపాదకీయాలు, వ్యాసాలు, చిత్ర సమీక్షలు రాశారు. వీటిలో కొన్నింటిని ‘నా మాట’ పేరిట సంకలనంగా వివరించారు జర్నలిస్టుల  యూనియన్ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో పాటుపడ్డారు. ఆయన ప్రతిభకు గుర్తింపుగా వివిధ సంస్థలు అవార్డులతో సత్కరించాయి. ఆయన సునిశిత పరిశీలనకు, తలపండిన అనుభవానికి ఈ ‘దిద్దుబాటు’ పుస్తకం నిలువుటద్దం. పత్రికా రంగ ప్రమాణాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఈ ‘దిద్దుబాటు’ కొండంత వెసులుబాటు.”

(హైదరాబాద్ పొట్టిశ్రీరాములు విశ్వ విద్యాలయంలో కమ్యూనికేషన్ జర్నలిజం పి జి- ఎం సి జె విద్యార్థిగా, అంతకుముందు, ఆ తరువాత కూడా నా తప్పులను ప్రత్యక్షంగా, పరోక్షంగా దిద్దిన, దిద్దుతున్న సార్  మృతికి కన్నీటి నివాళి. సార్ ప్రమాణాలను అందుకోవడం నాలాంటివారికి సాధ్యం కాదు. ఇందులో కూడా తప్పొప్పులు ఉండే ఉంటాయి.)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

ఒక పాత్రికేయుడి మరణం….

Also Read : 

న్యాయ- అన్యాయాల మీమాంస

RELATED ARTICLES

Most Popular

న్యూస్