Tuesday, September 17, 2024
HomeTrending Newsఅస్సాంలో నవశకం... చరిత్ర పుటల్లోకి ఉల్ఫా

అస్సాంలో నవశకం… చరిత్ర పుటల్లోకి ఉల్ఫా

ఈశాన్య రాష్ట్రాలకు ముఖ ద్వారమైన అస్సాంలో నవశకం మొదలైంది. దశాబ్దాల రక్తపాతానికి…అలజడికి ముగింపు పలుకుతూ ఉల్ఫా(United liberation front of Assam) నిర్ణయం తీసుకుంది. ప్రజాస్వామ్య పద్దతిలో హక్కులు సాధించుకుంటామని… అందుకు అస్సాం జాతీయ వికాస్ మంచ్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది.

మంగళవారం జరిగిన ప్రత్యేక, చివరి జనరల్ కౌన్సిల్ సమావేశంలో సిబాసాగర్ జిల్లాలోని ‘రోంగ్ ఘర్’ దుస్తులను రద్దు చేసినట్లు ఉల్ఫా ప్రధాన కార్యదర్శి అనూప్ చేతియా వెల్లడించారు. అధికారికంగా ప్రకటించడంతో ఉల్ఫా ఇక చరిత్రలో భాగమైంది. త్వరలో అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మను కలిసి ఉల్ఫా రద్దు తీర్మానాన్ని అందచేస్తామని ఆయన తెలిపారు. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి అప్పగించడం జరుగుతుందన్నారు.

అస్సాం సాయుధ తిరుగుబాట్ల చరిత్రలో డిసెంబర్ 29 నాటి శాంతి ఒప్పందం ఓ మైలురాయి కాగా ఉల్ఫా  కార్యాచరణకు దిగటం చారిత్రాత్మకం. అస్సాం ప్రజలకు సార్వభౌమాధికార, స్వతంత్ర రాజ్యాన్ని సాధించాలనే అసాధ్యమైన లక్ష్యంతో 1979 ఏప్రిల్ 7న ఉల్ఫా పురుడుపోసుకుంది. ఆగ్నేయాసియాలో LTTE తర్వాత అంతటి బలమైన వేర్పాటువాద సంస్థగా ఉల్ఫాకు పేరుంది.

బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్‌లలో ఉల్ఫాకు ఇప్పటికీ స్థావరాలు ఉన్లనాయి. ఈ సంస్థ సాయుదుల్లో కొందరు చైనా, పాకిస్తాన్‌లలో శిక్షణ కూడా పొందారు.

అస్సాంకు ప్రత్యేకమైన భాషా సంస్కృతులు, సహజవనరులు ఉన్నాయి. 19వ శతాబ్దిలో తేయాకు తోటలు, బొగ్గుగనులు, చమురు శుద్ధి పరిశ్రమల్లో పనిచేసేందుకు బయటివారు అస్సాంకు రావడం ఎక్కువైంది. అస్సామీ స్థానిక సంస్కృతి, సంప్రదాయాలపై దీని ప్రభావం పడింది. స్థానిక, స్థానికేతరుల మధ్య ఉద్రిక్తతలు పెరగడం మొదలైంది. బయటివారి పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు తలెత్తాయి. వాటిలోంచి పుట్టుకువచ్చిందే ఉల్ఫా. లక్ష్యసాధనకు సాయుధ మార్గాన్ని ఎంచుకున్న ఈ సంస్థ క్రమంగా ఎదుగుతూ కొరకరాని కొయ్యగా మారింది.

1990లో అస్సాంపై ఉల్ఫా పట్టు పతాకస్థాయికి చేరుకున్నది. అప్పట్లో సమాంతర ప్రభుత్వం నడిపిన చరిత్ర ఆ సంస్థకున్నది. అస్సాం అడవుల్లో ఉల్ఫా ఆడిందే ఆట. పాడిందే పాట. చెట్ల ఆకులు కదలాలన్నా ఉల్ఫా నాయకుల అనుమతి ఉండాల్సిందేనని కథలుగా చెప్పుకొనేవారు. బడా కంపెనీల నుంచి కోట్లలో ‘యుద్ధనిధి’ వసూళ్లు జరిగేవి. యూనిలివర్‌ వంటి బహుళజాతి కంపెనీ నుంచి మూడున్నర కోట్లు రాబట్టుకోవడంపై అంతర్జాతీయంగా గగ్గోలు తలెత్తింది.

ఉల్ఫా అణచివేతకు గట్టిచర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడులు రావడం మొదలైంది. దాంతో కేంద్రం సైన్యాన్ని పంపి తిరుగుబాట్లను అణచివేసేందుకు కఠిన పద్ధతులనే ప్రయోగించింది. 1200 మందికి పైగా ఉల్ఫా తీవ్రవాదులను అరెస్టు చేసింది. అస్సాంను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించింది. రాష్ట్రపతి పాలన విధించి సైనిక ప్రత్యేకాధికారాల చట్టం అమలు చేసింది. ఇవన్నీ కేంద్రానికీ, స్థానిక ప్రజలకు మధ్య దూరాన్ని పెంచాయి.

చర్చోపచర్చల తర్వాత డిసెంబర్ 29 ఒప్పందం ప్రకారం ఉల్ఫా తీవ్రవాదులు ఆయుధాలు వదిలిపెట్టి ఎన్నికల రాజకీయాల్లోకి అడుగుపెడతారు. దీంతో దశాబ్దాలుగా అస్సాంను పీడిస్తున్న వేర్పాటువాద హింసాకాండకు తెరపడుతుందని భావిస్తున్నారు.

ఒప్పందం ప్రకారం అస్సాంలోని ఆరు కమ్యూనిటీలు – మోరన్, మటాక్, తై-అహోమ్, కోచ్-రాజ్‌బాంగ్షి, సూటియా, టీ ట్రైబ్స్ వర్గాలకు ST హోదాతో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి.

NRC జాతీయ పౌరుల రిజిస్టర్ కు అనుగుణంగా అక్రమ వలసల నిరోధానికి చర్యలు చేపట్టాలి.
భూమి హక్కులు, అటవీ సంరక్షణ, ఆక్రమణల నివారణకు సంబంధించిన నిబంధనలు సరళతరం చేయాలి
లొంగిపోయిన ఉల్ఫా సాయుధ కార్యకర్తలకు పునరావాసం, ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ అమలు చేయాలి.

ఒప్పందం అమలును పర్యవేక్షించడానికి ఉల్ఫా, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అస్సాం అడ్మినిస్ట్రేషన్ ప్రతినిధులతో కూడిన ఒక ఉమ్మడి సంస్థ ఏర్పాటు

అరబింద రాజఖోవా నేతృత్వంలోని చర్చల అనుకూల ఉల్ఫా వర్గం మాత్రమే ఈ ఒప్పందంపై సంతకాలు చేసిందని గుర్తుంచుకోవాలి. చర్చలను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న పరేశ్‌ బారువా నేతృత్వంలోని అతివాద వర్గం శాంతి ఒప్పందానికి దూరంగా ఉంది.
370 ఆర్టికల్ రద్దు, అయోధ్య సమస్య పరిష్కారం తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉల్ఫాతో శాంతి చర్చలు సఫలం…ఆచరణలోకి రావటం రాజకీయ లబ్ది చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఒప్పందం అమలులో తేడాలు వస్తే మళ్ళీ ఉల్ఫా కొత్త రూపంలో జడలు విప్పుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
-దేశవేని భాస్కర్
RELATED ARTICLES

Most Popular

న్యూస్