హోటళ్లలో తినకుండా పారేసే ఆహారపదార్థాల గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తామా ? సూపర్ మార్కెట్లలో అమ్ముడవకుండా నెలల తరబడి ఉండిపోయే సరకులు ఎన్ని రకాలుంటాయో ఎవరికైనా తెలుస్తుందా? అంతెందుకు- ఇంట్లో వండిన పదార్థాలు నచ్చలేదంటూ బయటి నుంచి తెప్పించుకుని తినలేక అందులో సగం పారేస్తాం. ఆహారవృధా ఎంతో ఎప్పుడన్నా అనుకుంటామా? అదే ఇంట్లో అమ్మ వండితే సాధారణంగా అందరూ తినేవే ఉంటాయి. ఇష్టం లేనివి వండరు. అయినా తినకుండా బయటినుంచి తెప్పించి అవీ వేస్ట్ చేసే పిల్లలు ఉంటారు. ఇక పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో పారేసే ఆహారం లెక్కకు అందదు. ఈ సమస్య ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. సమస్యకు మూలం తెలుసుకుంటే అది సులభం.
అమెరికాలో కొన్ని రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాయి. అందుకు వారికి సహాయపడుతోంది కృత్రిమ మేధ అంటే ఒకింత ఆశ్చర్యం, కుతూహలం కలుగుతాయి. అమెరికాలో పండే ఆహారంలో మూడోవంతు ఎప్పుడూ వృధా అవుతూ ఉంటుంది. 2022 సంవత్సరంలో వంద కోట్ల మెట్రిక్ టన్నుల ఆహారం పారేశారు. ప్రపంచవ్యాప్తంగా వెలువడే గ్రీన్ హౌస్ గ్యాస్ లో 8-10 శాతం ఆహార వృధాదే.
ఈ సమస్యకు పరిష్కారం కృత్రిమ మేధ చూపింది. అదెలా అంటే?
ఒక హోటల్ తన చెత్త డబ్బాల్లో కెమెరా అమర్చి…హోటల్ కి వచ్చేవారు ఏ పదార్థాలు తినడంలేదో తెలుసుకున్నారు. తినడానికి ఇబ్బందిగా ఉండే క్రాయిసెంట్స్ వదిలేస్తున్నారని తేలింది. అలాగే ఒక సూపర్ మార్కెట్ లో ఎర్రని ఉల్లిపాయలు కొని, మిగిలినవి వదిలేస్తున్నారని, దాంతో అవి పాడయి నష్టం వస్తోందని తేలింది. ఇక్కడ రెండు చోట్లా దారి చూపింది ఏఐ సూచనలే. అంతే కాదు ఇప్పుడిది ట్రెండింగ్ ఇండస్ట్రీ కూడా. ఒకరకంగా చెప్పాలంటే మానవ తప్పిదాలను నివారించే మార్గం కూడా.
పనికిరాని, పారేసిన ఆహార పదార్థాలు డంపింగ్ యార్డ్ కి పంపిస్తారు. అక్కడ అవి కుళ్లిపోయి గ్రీన్ హౌస్ గ్యాస్ విడుదల చేస్తాయి. వీటివల్ల భూ ఉపరితలం వేడెక్కుతుంది. ఈ పాయింట్ దగ్గర విన్నౌ అనే కంపెనీ వ్యాపార అవకాశం చూసింది. రెస్టారంట్ లో పారేసే ఆహారం పైన కన్నేసి ఉంచే ఏఐ సాధనం అభివృద్ధి చేసింది. ఇదే బాటలో అఫ్రెష్ అనే కంపెనీ సూపర్ మార్కెట్ డేటా విశ్లేషించే టూల్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా వినియోగదారులు ఏవి కొంటున్నారో, ఏవివదిలేస్తున్నారో తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సంస్థలు ఆహార వృధాని అరికట్టే పనిలో ఉన్నాయి.
అయితే ఇదేమంత సులువు కాదు. డేటా సేకరణ, విశ్లేషణకు ఎంతో విద్యుత్ అవసరం. ఆ దిశగానూ కొన్ని పర్యావరణ సమస్యలున్నాయి. పైగా నిమిష నిమిషానికి మారే వినియోగదారుల అభిరుచులు పసిగట్టడం ఏ ఐ కి కష్టమే. అయితే సమస్యకు పరిష్కారం సాధించే దిశగా ముందడుగు పడిందని చెప్పచ్చు. మనదేశంలోనూ ఇటువంటివి రావాలి. ముఖ్యంగా పెళ్లిళ్లు, హోటళ్లలో ఆహారవృధాను అరికట్టడానికి. ఆ రోజు త్వరగా రావాలని కోరుకుందాం.
-కె.శోభ