Saturday, November 23, 2024
HomeTrending Newsరేవంత్ రెడ్డి - కేటిఆర్ మాటల యుద్ధం

రేవంత్ రెడ్డి – కేటిఆర్ మాటల యుద్ధం

తెలంగాణ సెంటిమెంటుకు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఆజ్యం పోస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహ స్థలంపై వివాదం మొదలవుతోంది. గతంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలతోనే రెండు రాష్ట్రాలుగా విడిపోయే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. ఇప్పుడు అదే రీతిలో కెసిఆర్ అవసరాన్ని ప్రజలకు మరోసారి గుర్తు చేస్తోంది. అయితే ఈ దఫా కెసిఆర్ కాకుండా కేటిఆర్ రంగంలోకి దిగారు.

తెలంగాణ సచివాలయం ఎదురుగా విగ్రహం ఏర్పాటుకు కెసిఆర్ ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఆ స్థలంలో రాజీవ్ గాంధి విగ్రహం ఏర్పాటు చేస్తామని అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలోనే సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కెసిఆర్ పాలనతో విసిగిన ప్రజలు అప్పుడు అంతగా పట్టించుకోలేదు. ఆగస్టు 20 రాజీవ్ గాంధి జయంతి సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు కార్యాచరణకు దిగారు.

ఈ తరుణంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఆర్ ఘాటుగా స్పందించారు. ప్రభుత్వం గనుక ఏర్పాటు చేస్తే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి తీరుతామని హెచ్చరించారు. సోమవారం రక్షా బంధన్ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటిఆర్ పలు అంశాలు ప్రస్తావించారు. నాలుగేండ్లలో బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తెలంగాణ సచివాలయం ఎదురు స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంచేశారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో తరలించి, కాంగ్రెస్‌ కోరుకున్న చోట ఏర్పాటు చేస్తామన్నారు.

బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో ఏనాడూ పేర్ల మార్పుపై ఆలోచించలేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. అందుకే ప్రభుత్వ పథకాలు, ప్రాంతాలకు కాంగ్రెస్‌ నాయకుల పేర్లు ఉన్నా వాటిని మార్చే ప్రయత్నం చేయలేదని వివరించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, రాజీవ్‌గాంధీ ట్రిపుల్‌ఐటీ, రాజీవ్‌ గాంధీ ఉప్పల్‌ స్టేడియం, హైదరాబాద్‌-కరీంనగర్‌ రహదారికి రాజీవ్‌ రహదారి, అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం.. ఇలా ఎన్ని పేర్లున్నా వాటిని తాము మార్చలేదని చెప్పారు.

తెలంగాణ తల్లిని అవమానించిన బాధతో రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని తరలిస్తామని చెప్తున్నామన్నారు. భవిష్యత్తులో రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ పేర్లతో ఉన్న పథకాలు, ప్రాంతాల పేర్లను మారుస్తామని తెలిపారు. ముంబై విమానాశ్రయానికి ఛత్రపతి శివాజీ, బెంగళూరు విమానాశ్రయానికి కెంపెగౌడ పేర్లు ఉన్నాయని..హైదరాబాద్‌ విమానాశ్రయానికి తెలంగాణ ప్రముఖుడి పేరు పెడతామన్నారు.

కేటిఆర్ వ్యాఖ్యలపై మంగళవారం సిఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పదేళ్ళలో తెలంగాణ విఘ్రహంపై నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ నేతలు రాజేవ్ గాంధి విగ్రహం తాకితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

విగ్రహ స్థలం విషయానికి వస్తే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఆ స్థలంలో తెలుగు తల్లి విగ్రహం ఉండేది. ఫ్లై ఓవర్ పేరు కూడా తెలుగు తల్లి ఫ్లై ఓవర్. ఆ ప్రాంతంలోనే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ అస్తిత్వం చాటాలని తెలంగాణ వాదుల డిమాండ్. కేటిఆర్ – రేవంత్ రెడ్డి మాటల యుద్ధంపై ఇప్పుడు అంతగా చర్చ జరగపోయినా రాబోయే కాలంలో ప్రజలపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్