Sunday, January 19, 2025
HomeTrending Newsతెలంగాణలో బెంగాల్ ప్రయోగం..రేవంత్ సంచలన ఆరోపణలు

తెలంగాణలో బెంగాల్ ప్రయోగం..రేవంత్ సంచలన ఆరోపణలు

మునుగోడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించి, పశ్చిమ బెంగాల్ తరహా ప్రయోగం చేయాలని బీజేపీ – టీఆర్ఎస్ కలిసికట్టుగా కుట్ర పన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో చీకట్లో మోడీ, అమిత్ షా ఉపదేశం తీసుకుని మునుగోడుకు భారీ కాన్వాయ్ తో రాబోతున్నారని అన్నారు. ఆయన వచ్చీ రావడంతోనే ఏదో ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరగబోతోందని… ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించి, స్థానిక సెంటిమెంట్ ను రాజేయడం ద్వారా కుట్రకు ఆజ్యం పోయబోతున్నారని ఆరోపించారు. ఇదే క్రమంలో వ్యూహాత్మక కుట్రలో భాగంగా అతి త్వరలో కేంద్ర హోం శాఖ అమిత్ షా ఆదేశంతో మునుగోడులో సీఆర్పీఎఫ్ బలగాలను దించబోతోందని, ఆ బలగాలు టీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయడం… ప్రతిగా రాష్ట్ర పోలీసులు బీజేపీ నాయకులపై దాడులు చేయడం… తద్వారా నియోజకవర్గంలో ఉద్రిక్తతలు సృష్టించి, ప్రజలను ఆ రెండు పార్టీల మధ్యనే పోలరైజ్ చేయడం ఈ కుట్ర ఉద్ధేశమని రేవంత్ రెడ్డి సంచనల ఆరోపణ చేశారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచనల మేరకు పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, బీజేపీ మధ్య ఇదే రకమైన వ్యూహాత్మక కుట్ర చేసి మమతను అధికారంలో కొనసాగేలా, బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగి… మిగతా పార్టీలు ఊసులో లేకుండా చేయడంలో సఫలమయ్యారని… ఇదే కుట్రను ఇప్పుడు మునుగోడులో బీజేపీ – టీఆర్ఎస్ కలిసి రక్తికట్టించబోతున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మునుగోడు ప్రజలు అప్రమత్తంగా ఉండి, కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన సీఆర్పీఎఫ్ బలగాలు, రాష్ట్ర పోలీసులు రెండు పార్టీల పక్షాన మొహరించి ఎన్నికల పోలరైజేషన్ కు సహకరించే పరిస్థితి రావడం దుర్మార్గమన్నారు.
మునుగోడులో బ్యాలెట్ పేపర్ రూపొందించడంలో రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం విఫలమైందన్నారు రేవంత్ రెడ్డి. బ్యాలెట్ పేపర్ లో నాలుగో స్థానంలో ఉండాల్సిన టీఆర్ఎస్ ను రెండో స్థానంలోకి ఎలా తెస్తారని ప్రశ్నించారు. జాతీయ పార్టీ అభ్యర్థులను ముందు ఉంచి, ఆ తర్వాతే ప్రాంతీయ పార్టీ అభ్యర్థులను ఉంచాలని, టీఆర్ఎస్ ఇంకా జాతీయ పార్టీ కాలేదని గుర్తు చేశారు. ఆ పార్టీ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థిగానే నామినేషన్ వేసిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. బ్యాలెట్ పేపర్ మార్చాలని రేవంత్ డిమాండ్ చేశారు.
ఈటెల, రఘునందన్ పై కేసులు ఏమయ్యాయి…
దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికల సందర్బంలో పోలీసు కేసులు, భూ కబ్జాలు అంటూ హడావుడి చేసిన టీఆర్ఎస్ ఆ తర్వాత రఘునందన్, ఈటెల రాజేందర్ గెలిచిన తర్వాత వాళ్లపై కేసులు కాకులెత్తుకెళ్లాయా అని ఎద్దేవా చేశారు. దుబ్బాక ఎన్నికల సమయంలో రఘునందన్ బావమరిది దగ్గర కోటి రూపాయలు పట్టుకున్నారు. రఘునందన్ కోట్లు పంచుతున్నాడని హడావుడి చేసి… ఒక రకమైన వాతావరణం సృష్టించారు. అదే సీన్ హుజూరాబాద్ లో సృష్టించారు. ఈటెల పై భూకబ్జా కేసు పెట్టి, అరెస్టే తరువాయి అన్నట్టు హడావుడి చేశారు. ఎన్నికల్లో ఆ రెండు పార్టీల మధ్యనే పోలరైజ్ అయ్యేలా ఉద్రిక్తతలు సృష్టించారు. ఈటెల గెలిచాక మౌనందాల్చారు. అంటే… ఈ రెండు చోట్ల కూడా బీజేపీ గెలుపునకు కేసీఆర్ పరోక్ష సహకారం అందించారు. రెండు పార్టీలు కలిసి పాము – ముంగీస ఆట ఆడుతూ ప్రజలను మభ్యపెడుతున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రాజగోపాల్ మా వాళ్లను బెదిరిస్తుంటే కేసులెందుకు పెట్టరు…
బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తల అంతు చూస్తానంటూ బెదిరిస్తున్నారు. మా కార్యకర్తలపై బీజేపీ వాళ్లు దాడులు చేస్తున్నారు. మా రథాలపై దాడులు చేస్తున్నారు. మా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. కానీ, మా వాళ్లపై దాడులు చేస్తోన్న, చంపేస్తామని హెచ్చరిస్తోన్న రాజగోపాల్ రెడ్డి పై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై లేదా అని ప్రశ్నించారు.
ఆ డబ్బులు ఎవరివో ఎందుకు చెప్పడం లేదు…
ఇటీవల పోలీసుల తనిఖీలలో కోట్ల రూపాయలు డబ్బులు దొరుకుతున్నాయని… గతంలో ఎన్నికలు, ఉప ఎన్నికల సమయంలో ఇలా డబ్బులు దొరికితే అవి ఎవరి వద్ద దొరికాయో పోలీసులు విలేకరుల సమావేశం పెట్టి చెప్పేవారని… ఇప్పుడు ఎందుకు చెప్పడం లేదని, ఎందుకు సమాచారాన్ని దాస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు.
ఖర్గేకు అభినందనలు

కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షుడుగా మల్లికార్జున ఖర్గే ఎన్నిక కావడం పట్ల రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సుదీర్ఘ అనుభవం ఉన్న ఖర్గే, కాంగ్రెస్ లాంటి పార్టీకి అధ్యక్షుడు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఇలా అధ్యక్షుడుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవడం కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమన్నారు. బీజేపీలో నడ్డా అయినా మరెవరైనా సీల్డ్ కవర్ లో రావాల్సిందేనని ఎద్దేవా చేశారు. మునుగోడులో పార్టీలోని మిగతా సీనియర్లు ప్రచారం చేయడం లేదన్న విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ… భారత్ జోడో యాత్ర నేపథ్యంలో నాయకులందరం బాధ్యతలు పంచుకున్నామని… అందులో భాగంగా ఎవరికి ఏ బాధ్యతలు ఇచ్చామో వాళ్లు ఆ బాధ్యతల్లో ఉన్నారని చెప్పారు.

Also Read: టిఆర్ ఎస్, బిజెపిలతో తెలంగాణకు చేటు రేవంత్ రెడ్డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్