Monday, January 20, 2025
HomeTrending Newsకార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ: నేతల సూచన

కార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ: నేతల సూచన

YSRCP Plenary:  ఈనెల 8,9 తేదీలలో గుంటూరులో నిర్వహించనున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేసేందుకు నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని పార్టీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు.  ప్లీనరీ ఏర్పాట్లపై తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో  ముఖ్య నేతల సమావేశం జరిగింది. దీనిలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ప్లీనరీని సిఎం జగన్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారని, ప్లీనరీ నిర్వహణ కమిటీల్లో ఉన్న నేతలు ఆయా కమిటీలకు సంబంధించి సభ్యులతో సమావేశమై వారికి అప్పగించిన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహించాలని కోరారు.

టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి మాట్లాడుతూ జగన్ సిఎం అయిన తరువాత జరుగుతోన్న ప్లీనరీ కాబట్టి ఇవి ఎంత విజయవంతంగా జరిగితే పార్టీకి, ప్రభుత్వానికి అంత మంచిపేరు వస్తుందని చెప్పారు. రాబోయే రెండేళ్ల కాలంలో మరింత మెరుగ్గా పనిచేసి ప్రజలకు మరింత చేరువ అయ్యేలా ఏమి చేయగులుగుతామో జగన్ దిశా నిర్దేశం చేస్తారని వివరించారు. ప్లీనరీకి హాజరయ్యేవారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు.

రాష్ట్రంలోని స్థానిక సంస్ధల నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు దాదాపు 80 శాతం వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ నేపథ్యంలో జరుగుతోన్న ప్లీనరీకి ఎంతో ప్రాధాన్యం ఉందని ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వసతి, బోజనం, రవాణా వంటి వాటిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ప్లీనరీ నిర్వహణ కమిటీ కన్వీనర్,రాష్ర్ట విద్యాశాఖమంత్రి  బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ 2017లో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నసమయంలో ప్లీనరీ సమావేశాలు జరుపుకున్నామని నాటి ప్లీనరీకి,  నేటి సమావేశాలకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. ప్రభుత్వంపై ప్రజల అంచనాలు అధికంగా ఉంటాయని , రాష్ర్ట అభివృధ్దికి ప్లీనరీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాన్ని అందరూ ఆసక్తిగా గమనిస్తుంటారని చెప్పారు. ప్రజలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరు, ప్రభుత్వ ప్రతిష్ట ఇనుమడించేలా, కార్యకర్తలు గర్వపడేలా ప్లీనరీ నిర్వహించుకుందామని పిలుపు ఇచ్చారు.

ఈ సమీక్షా సమావేశంలో క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రులు సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, గుడివాడ అమర్ నాథ్, దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి పేర్ని నాని,  ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కొలుసు పార్థసారధి ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ప్లీనరీ సందర్భంగా ఏర్పాటు చేయనున్న రక్తదాన శిబిరం పోస్టర్, నమోదు చేసుకోవాల్సిన వెబ్ సైట్ పేరును ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్