Spin duo: టీమిండియా స్పిన్నర్లు యజువేంద్ర చాహల్, కులదీప్ యాదవ్ ఇద్దరూ జట్టులో ఉండడం సంతోషమని భారత జట్టు వైట్ బాల్ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఇద్దరు కలిసి టీమ్ లో ఉన్నప్పుడు బాగా రాణించారు, మంచి విజయాలు కూడా నమోదు చేశాం, కొంతకాలం గ్యాప్ తర్వాత ఇద్దరూ కలిసి ఆడుతుండడం శుభ పరిణామం’ అన్నాడు. రకరాకాల కాంబినేషన్లతో కొద్ది రోజులుగా ఇద్దరినీ ఒకేసారి ఆడించలేకపోయామని అన్నాడు.
‘కుల్దీప్ ఆటలో కుదురుకునేందుకు కొంత సమయం ఇవ్వాలి ఆ తర్వాత అతడు అద్భుతాలు సృష్టించగలడు, మొదలే అతనిపై ఒత్తిడి పెట్టడం ద్వారా మంచి ఫలితం రాబట్టలేం’ అని రోహిత్ అభిప్రాయపడ్డారు. చాహల్ సౌతాఫ్రికా టూర్ ఆడాడు, కానీ కుల్దీప్ కు గాయం కారణంగా జట్టులో చోటు లభించలేదు.
సౌతాఫ్రికా టూర్ పై కూడా రోహిత్ స్పందించాడు. గత కొన్ని సంవత్సరాలుగా తాము అత్యుత్తమ ప్రదర్శన ఇస్తున్నామని, ఒకటి రెండు సిరీస్ లు ఓడిపోయినంత మాత్రాన ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నాడు.
వెస్టిండీస్- ఇండియా మధ్య మూడు వన్డేల సిరీస్ రేపు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మొదలు కానుంది. మూడు వన్డేలు ఇదే వేదికపై జరగనున్నాయి, ఆ తర్వాత మూడు టి20 మ్యాచ్ లు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతాయి. రేపటి మ్యాచ్ కు మరో ప్రాముఖ్యత కూడా ఉంది. ఇండియా ఐసిసి వన్డేల్లో తన వెయ్యెవ మ్యాచ్ ఆడబోతోంది.
మయాంక్ అగర్వాల్ తో పాటు శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్ లు కోవిడ్ కారణంగా మొదటి మ్యాచ్ ఆడే అవకాశం లేదని, ఇషాన్ కిషన్ తో కలిసి తాను ఇన్నింగ్స్ ఆరంభిస్తానని రోహిత్ వెల్లడించాడు.
Also Read : ప్రొ కబడ్డీ: హర్యానా, పాట్నా విజయం- మరో మ్యాచ్ టై