Rohith not to play test series:
సౌతాఫ్రికా టెస్ట్ సిరీస్ కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. తొడకండరాల గాయం తిరగ బెట్టడంతో టీమిండియా టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ గా కూడా ఉన్న రోహిత్ శర్మ మూడు టెస్టుల సిరీస్ ఆడబోవడం లేదని బిసిసిఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. రోహిత్ స్థానంలో భారత్ ‘ఏ’ జట్టు ఓపెనర్ ప్రియాంక్ పంచాల్ ను జట్టులోకి తీసుకున్నారు.
ముంబైలో ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా రోహిత్ శర్మ చేతికి కూడా గాయమైంది. ఈ గాయం తీవ్రత పెద్దగా లేనప్పటికీ, అదే సమయంలో తొడకండరాల నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దీనితో రోహిత్ కు నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ వారంలో సౌతాఫ్రికా పర్యటనకు టీమిండియా పయనం అవుతున్న తరుణంలో గాయంతో రోహిత్ దూరం కావడం ఆందోళన కలిగించే విషయమే. అయితే ఇటీవలే వన్డే జట్టు కెప్టెన్ గా నియమితుడైన ఈ హిట్ మ్యాన్ సౌతాఫ్రికా తో జరిగే వన్డే సిరీస్ నాటికి జట్టుతో చేరతాడని బిసిసిఐ చెబుతోంది.
ఇండియా-సౌతాఫ్రికా మధ్య ఈ నెల 26 నుంచి మొదటి టెస్ట్ మొదలవుతుంది. 2022, జనవరి 19,21,23 తేదీల్లో వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి. మూడు టి 20 మ్యాచ్ లు కూడా ఆడాల్సి ఉన్నప్పటికీ ఆ షెడ్యూల్ ఇంకా ఖరారు చేయలేదు.
Also Read : కోహ్లీకి మంచిదే: బ్రాడ్ హాగ్