సినీ పెద్దల కోరిక మేరకే ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు నగరి వైకాపా ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం సినిమా టికెట్లు అమ్ముతోందంటూ కొందరు నేతలు చేస్తున్న విమర్శలు సరికాదని, చిరంజీవి, నాగార్జున, మరికొందరు పరిశ్రమ ప్రముఖులు కోరడంతోనే ఈ విధానాన్ని అమలు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారని రోజా తెలియజేశారు. సిఎం జగన్, అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు చాలా బాధాకరమని తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రోజా హెచ్చరించారు. అయన చేసిన వ్యాఖ్యలు దారుణమని, దీనిపై ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
ఆ తర్వాతా తిరుమల తిరుపతి దేవస్థానము చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డిని ఎమ్మేల్యే ఆర్కే రోజా కలిశారు. నగరి నియోజకర్గంలో ఆలయాల నిర్మాణాలకు టీటీడి ద్వారా ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.
- తడుకు RS నుంచి అప్పలాయగుంట వరకు రోడ్డు వెడల్పు చేయాలి
- నిండ్రలోని పురాతన ప్రసన్న వెంకటేశ్వర ఆలయం పునరుద్ధరణ పనులు చేపట్టాలి
- ముడిపల్లి లోని అతి పురాతన అగస్తీశ్వర స్వామి ఆలయం, కరియ మాణిక్య స్వామి ఆలయాలను టిటిడి స్వాధీనం చేసుకోవాలి
- నగరి దేశమ్మ ఆలయానికి దేవాదాయశాఖ కామన్ గుడ్స్ నిధుల ద్వారా మంజూరు అయిన వాటికి టీటీడీ ద్వారా పనులు జరిపించాలని రోజా కోరారు.