బెంగుళూరు బౌలర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లతో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు జరిగిన మరో ఐపీఎల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ముంబై ఇండియన్స్ పై ఘనవిజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ఆరౌండ్ ప్రతిభతో రాణించి బెంగుళూరు విజయంలో కీలకపాత్ర పోషించారు.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. జట్టు స్కోరు ఏడు పరుగుల వద్ద బెంగుళూరు ఓపెనర్ పడిక్కల్ డకౌట్ అయ్యాడు. శ్రీకర్ భరత్ తో కలిసి కెప్టెన్ విరాట్ రెండో వికెట్ కు 68 పరుగులు జోడించారు. శ్రీకర్ 32 పరుగులు (27 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి ఔటయ్యాడు. విరాట్- మాక్స్ వెల్ కలిసి మూడో వికెట్ కు 51 భాగస్వామ్యం నెలకొల్పారు. విరాట్ 51 (42 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) మ్యాక్స్ వెల్ 56 (37 బంతుల్లో 6 ఫోర్లు,3 సిక్సర్లు) పరుగులు రాబట్టారు. దీనితో బెంగుళూరు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా -3, ఆడమ్, బోల్ట్, రాహూల్ చాహార్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ముంబై ధాటిగానే ఆరంభించినా త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. జట్టులో ఇద్దరు ఓపెనర్లు మినగా మిగిలిన వారెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. రోహిత్ 43 (28 బంతుల్లో 5 ఫోర్లు,1 సిక్సర్); డికాక్-24 పరుగులు మాత్రమే చేయగలిగారు. 17వ ఓవర్లో హర్షల్ వరుస బంతుల్లో పోలార్డ్, హార్దిక్ పాండ్యా, ఆడమ్ మిల్నే లను అవుట్ చేశాడు. దీనితో ముంబైకు కోలుకోలేని దెబ్బ తగిలింది. 18.1 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్-4; యజువేంద్ర చాహల్-3; మ్యాక్స్ వెల్-2, సిరాజ్-1 వికెట్ పడగొట్టారు.
బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించిన మ్యాక్స్ వెల్ కు మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.