Sunday, September 8, 2024
Homeసినిమాఇది రాజమౌళి సినిమాయేనా?

ఇది రాజమౌళి సినిమాయేనా?

Weak Screenplay: పంచభూతాల లో నీరు, నిప్పు చాలా శక్తి వంతమైనవి. కానీ ఆ రెంటినీ కలిపితే ?? నిప్పు వలన నీరు ఆవిరి అవుతుంది. నీరు వలన నిప్పు ఆరిపోతుంది. సరిగ్గా RRR విషయం లో అదే జరిగింది. అయితే నీటిని, నిప్పు ను కలపడానికి గాలి అనే భూతం అవసరం పడుతుంది. బహుశా ఆ గాలి రాజమౌళి ఏమో !!

సహజంగా రాజమౌళి సినిమాలలో ఉండేవి బలమైన కథ, బిగువైన కథనం, బలమైన హీరో, విలన్ లు, వారిని అల్లుకుని ఉండే భావోద్వేగాలు, పోరాట సన్నివేశాలు. రాజమౌళి సినిమాలలో బడ్జెట్ ఎంత పెరుగుతున్నా ఈ బేసిక్ విషయాలలో ఏ మాత్రం మార్పు ఉండదు. అందుకే రాజమౌళి సక్సెస్ ల మీద సక్సెస్ లు అందుకున్నాడు. కానీ RRR విషయం లో లెక్క తప్పింది. బలమైన కథ రాసుకోవడంలో రాజమౌళి లెక్క తప్పాడు. కధ లేకపోవడంతో కథనం గాడి తప్పింది. పేరుకు ఇద్దరు హీరోలు ఉన్నా బలమైన విలన్ లేడు, అందువలన భావోద్వేగాలు పండలేదు, పొరాట సన్నివేశాలు ప్రహసనం (ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో) అయ్యాయి. బ్రిటిష్ వారు ఒక వ్యక్తి కాదు. ఒక వ్యవస్థ. ఇందులో విలన్ ఒక వ్యక్తి మాత్రమే. రాజమౌళి సినిమాలలో విలన్ చాలా బలంగా ఉంటాడు. వాడిని హీరో చంపితే ప్రేక్షకులకు ఒక సంతృప్తి ని ఇస్తుంది. కారణం అంత బలంగా విలన్ ను రాజమౌళి చూపిస్తాడు కనుక. కానీ ఈ సినిమాలో విలన్ చాలా వీక్. వాడిని చంపినా బ్రిటిష్ అనే వ్యవస్థకు వచ్చే నష్టం ఏమీ లేదు. వాడు పోతే ఇంకొకడు వస్తాడు, ఇది ప్రేక్షకులకు తెలుసు కనుకనే విలన్ ను హీరో లు చంపినా ప్రేక్షకులు సంతృప్తి పడలేదు. అనగా హీరో, విలన్ ల మధ్య బలమైన కాంఫ్లిక్ట్ పడలేదు. పైగా మైసూర్ బోండా లో మైసూర్ ఏది అన్నట్లు దేశభక్తి సినిమాలో దేశభక్తి మచ్చుకు కూడా కనపడదు. ఇది ఖచ్చితంగా రాజమౌళి దర్శకత్వ లోపం అనే అనుకోవాలి.

సినిమా కథ బ్రిటిష్ అధికారి భార్య ఒక గొండ్ల అమ్మాయి ను పట్టుకుని ఢిల్లీ కి వెళ్లడంతో మొదలవుతుంది. ఆ అమ్మాయిని తీసుకుని రావడం అనే లక్ష్యంతో ఎన్.టీ.ఆర్ కథ మొదలవుతుంది. అయితే ఆ పాయింట్ లో బలమైన conflict లేదు. బ్రిటిష్ అధికారి భార్య ఆ పిల్లనేమి కష్టపెట్టదు. కనుక ఆ పిల్లను ఎన్.టీ.ఆర్ తప్పకుండా తీసుకుని రావాలి అని ప్రేక్షకులకేమీ అనిపించదు. ఇక్కడ రాజమౌళి మొదటి ఫెయిల్యూర్ కనిపిస్తుంది.

ఆ తర్వాత రాం చరణ్, ఎన్.టీ.ఆర్ కలయిక, ఎన్.టీ.ఆర్ బ్రిటిష్ హీరోయిన్ తో కలయిక ఇవన్నీ బోరింగ్ గా సాగుతాయి. పైగా ఆ సన్నివేశాలు లగాన్ ను, టైటానిక్ ను గుర్తుకు తెస్తాయి. ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్ బాగుంది. నిజానిక్ ఫస్ట్ హాఫ్ లో బాగుండేవి ఎన్.టీ.ఆర్, రామ్ చరణ్ ఎంట్రీ సీన్ లు మరియు ఇంటర్ వెల్ ముందు యాక్షన్ సీన్ ఇవి మాత్రమే. మిగతా సీన్లు బోరింగ్.

సెకండ్ హాఫ్ మొదలయ్యాక రాజమౌళి సినిమా కాస్త బోయపాటి సినిమాలా మారిపోతుంది. ఫైట్ వెనుక ఫైట్ వస్తూనే ఉంటాయి. అయినా ఏది అద్భుతం అనిపించదు. ఆఖరికి క్లైమాక్స్ ఫైట్ కూడా ఎక్కలేదు అంటే దానికి కారణం రాజమౌళినే.

ఇద్దరి హీరోలను బ్యాలన్స్ చేయడంలో కూడా రాజమౌళి విఫలం అయ్యాడు. ఎన్.టీ.ఆర్ లక్ష్యమే చిన్నది. కనుక పాత్ర ప్రాధాన్యత కూడా చిన్నదే. చివరకు రామునికి సహాయం చేసే హనుమంతునిలా సరిపెట్టుకున్నాడు. అనగా ఒక సపోర్టింగ్ రోల్ కు దిగజరిపోయాడు. కానీ యాక్టింగ్ లో వంక పెట్టడానికి లేదు. పాత్ర చిన్నదైనా మొహంలో వేరియేషన్స్ బాగా చూపించాడు. ముఖ్యంగా కొమరం భీముడో పాటలో చెలరేగిపోయాడు. అయినా ఇంత ప్రాధాన్యత లేని పాత్ర ఒప్పుకోవడం ఎన్.టీ.ఆర్ కు అవసరం లేదేమో. రాజమౌళి కోసం ఒప్పుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ సినిమా కు నిజమైన హీరో రామ్ చరణ్. తన పాత్రకు ఒక బలమైన లక్ష్యం ఉంది, దానికొక నేపథ్యం ఉంది. యాక్షన్ సన్నివేశాలలో చరణ్ బాగానే రాణించాడు. కానీ మొహంలో సింగిల్ ఎక్స్ ప్రెషన్ తో నెట్టుకొచ్చేశాడు.  డాన్స్ ఎన్.టీ.ఆర్ తో పోటా పోటీ గానే చేసాడు. ఎడిటింగ్ అస్సలు బాలేదు. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు కత్తిరించవచ్చు. యాక్షన్ సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో ఏమాత్రం హత్తుకోలేదంటే దానికి  ఎడిటింగ్ కూడా ఒక కారణం.

Alia Bhatt Rrr

అసలు ఈ సినిమా స్టోరీ హిస్టరీ నా? హిస్టరీ ఫిక్షన్ పేరుతో ఏదైనా తీసేయొచ్చా? ఈ రోజు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ స్నేహితులుగా చూపారు. నిజానికి అల్లూరి ఎప్పుడూ మన్యం దాటలేదు. కొమరం ఎప్పుడూ తెలంగాణ దాటలేదు. అసలు ఇద్దరికి సంబంధమే లేదు. అయినా సినిమాటిక్ లిబెర్టీ ఉపయోగించి తీసేసామంటే చెల్లుతుందా ? రేపు మరొకడు గాంధీ, నెహ్రూ తుపాకులు పట్టుకుని బ్రిటీష్ వారిపై యుద్ధానికి వెళ్లారు అని సినిమా తీస్తే మనం అంగీకరిస్తామా? సినిమాటిక్ లిబెర్టీ అని వదిలేస్తామా?

సినిమా అత్యంత శక్తివంతమైనది. కాశ్మీర్ ఫైల్స్ నిజంగా జరిగిన హిస్టరీ అనే కదా అంత మంది చూస్తున్నది. మరి RRR కు కూడా హిస్టరీ కి సంబందించిన వారి పేర్లు పెట్టి వారికి నచ్చిన కథ అల్లెస్తే అదే నిజమనుకోరా నేటి తరంవారు? రేప్పొద్దున్న అల్లూరి ఎవర్రా అని అడిగితే కొమరం భీమ్ ఫ్రెండ్ అని, కొమరం ఎవర్రా అని అడిగితే అల్లూరి సీతారామరాజు ఫ్రెండ్ అని చెబుతారేమో నేటి తరం పిల్లలు. అందుకే ఇలాంటి పిచ్చి కథలతో సినిమాలు తీయకుండా దర్శకులు కాస్త స్వీయ పరిమితులు విధించుకుంటే మంచిది.

Rrr Ticket Rates

సినిమాలో సరుకు లేదు కనుకే రాజమౌళి ఒకేసారి మొత్తం బడ్జెట్ డబ్బులు జనాల దగ్గర లాగేద్దాం అని టికెట్ రేట్లు అంత పెంచాడు. నార్త్ లో అయితే మల్టీప్లెక్స్ లలో 2000 కు పైగా ఉంది RRR సినిమా టికెట్ రేట్. రాజమౌళి సినిమా ఏదో ఒకటి ప్లాప్ కావాలి. లేకపోతే నెక్స్ట్ సినిమాలు 1000 కోట్ల బడ్జెట్ పెట్టి 10000 టికెట్ రేట్ పెట్టినా పెడతాడు.

అప్పుడు ఫ్లైట్ టికెట్ రేట్ కి సినిమా టికెట్ కొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్లాప్ ఏదో  ఈ RRR నే అయ్యేట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రాజమౌళి తీసిన అన్ని సినిమాలలో కధ పరంగా కథనం పరంగా ఇదే వీకేస్ట్ సినిమా.

-భాస్కర్ కిల్లి

RELATED ARTICLES

Most Popular

న్యూస్