Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Telangana RTC to send legal notice to Allu Arjun over ‘demeaning’ ad

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ – ఆర్ టి సి ఎం డి సజ్జన్నార్ ను అభినందించాలి. హీరో అల్లు అర్జున్ ర్యాపిడో అద్దె బైక్ ల ప్రకటనల్లో రోడ్డుసైడ్ దోసెలు వేస్తూ…ఒక వెటకారపు యాసతో ఆర్ టి సి ని ఎగతాళి చేశాడు.

Click to view Rapido Bike Ad by Allu Arjun on You Tube

ఇందులో అల్లు అర్జున్ దోసెలు చక్కగా వేయడం, పెనం మీద అల్లు అర్జున్ వేసిన దోసె తిరగేసేలోపే యాప్ లో బుక్ చేసుకున్న ర్యాపిడ్ బైక్ మనో వేగంతో రావడం వరకు తప్పు పట్టాల్సిందేమీ లేదు. ఆర్ టీ సీ బస్సెక్కితే దోసెలు నలిగినట్లు…కుక్కినట్లు…తొక్కినట్లు అని అట్లకు ముడిపెట్టి అట్లతద్ది ప్రకటన చేయడమే సజ్జన్నార్ అభ్యంతరం. అల్లు అర్జున్ కు, ర్యాపిడోకు లీగల్ నోటీసులు పంపుతున్నారు. హుందాగా అందులో ఆర్ టి సి ప్రస్తావనను తొలగిస్తారనే ఆశిద్దాం.

సాయి పల్లవి మిగతా నటుల్లా ప్రాసకోసం డాక్టర్ కాబోయి యాక్టర్ కాలేదు. డాక్టర్ అయ్యి కోరి యాక్టర్ అయ్యింది. హీరోయిన్ గా కాస్త పేరు రాగానే సంవత్సరానికి రెండు కోట్ల రూపాయలు వచ్చే ఒక సౌందర్య సాధన ప్రకటనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇప్పటికీ ప్రకటనల విషయంలో ఆ గీత మీదే నిలబడి ఉంది. అందరూ సాయి పల్లవులు కాలేరు.

మన పేరు మోసిన హీరోలు, హీరో ఇన్ లు కనిపించని ప్రకటనలు ఉండవు. విలాసవంతమయిన విల్లాలు మొదలు…ఆ విల్లాల్లో బాత్ రూములు కడిగే యాసిడ్ల దాకా డబ్బులిస్తే ఏ ప్రకటనలో అయినా నటిస్తారు. బైజూస్ చైతన్యమై మనకు చదువు చెప్తారు. ఏనాడూ పరీక్షలు రాయనివారు మనల్ను నీట్ ఐ ఐ టి భవసాగరాలను దాటిస్తూ ఉంటారు. పుట్టబోయే పిల్లలకు రెయిన్ బో ఇంద్రధనస్సులు సిద్ధం చేస్తూ ఉంటారు. తినండి అంటూ మన మీదికి పాన్ బహార్ డబ్బాలు విసురుతూ ఉంటారు. అది ఇది ఏమని…అన్నీ వారే చెబుతూ ఉంటారు. చివరికి మద్యం, మాదక ద్రవ్యాలను ప్రమోట్ చేసే సరొగేట్ అతి తెలివి ప్రకటనల్లో కూడా మొహమాటం లేకుండా నటిస్తారు.

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రకటన మీద సజ్జన్నార్ అభ్యంతరం మరింత విస్తృతమయిన చర్చకు అవకాశమిచ్చింది. సెలెబ్రెటీలకు సమాజం పట్ల మరింత బాధ్యత ఉండాలి. లక్షల, కోట్ల మందిని ప్రభావితం చేయగల అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. బాధ్యతగా వ్యవహరించాలి. కనీసం అభ్యంతరాలు వ్యక్తమయ్యాక అయినా స్పందించి తప్పును దిద్దుకోవాలి.

ప్రకటనల్లో తమ వస్తువును ఆకాశానికెత్తడం సహజం. అది వారి అవసరం. కానీ అనవసరమయిన పోలికలతో ఇంకో వస్తువును కించపరచడం మంచిది కాదు.

అసలే ఆర్ టి సి ఇబ్బందుల్లో ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఆర్ టీ సి లాభాపేక్ష లేకుండా తిరగబట్టే సమాజం ప్రగతి రథ చక్రాలు సవ్యంగా తిరిగాయి. ఆర్ టీ సి పాసులతో తిరిగిన విద్యార్థులు చదివిన చదువులెన్నో…ఏనాడూ ఆర్ టీ సి బస్సు మెట్లు ఎక్కని అల్లు అర్జున్ కు ఎలా తెలుస్తుంది? దోసెలా నలిగి నలిగి ఆర్ టీ సి బస్సుల్లో తిరిగిన పల్లె వెలుగులెన్నో…ఏనాడూ దోసెలా నలగని అల్లు అర్జున్ కు ఎలా తెలుస్తుంది? స్వదేశీ హీరో ఇన్ నగ్న పాదాలు పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు అంటూ విదేశాల్లో సామజవరగమనా…నిను చూసి ఆగగలనా! లలనా! అని హాయిగా పాడుకోక అల్లు అర్జున్ కు ఎందుకొచ్చిన ఈ ర్యాపిడ్ అట్ల తద్ది?

ఆర్ టీ సి నష్టాల్లో ఉండి ఉండవచ్చు. ఆర్ టీ సి లో ప్రయాణికులు నలిగిపోయి ఉండవచ్చు. ఆర్ టి సి కి ఇప్పుడు ప్రత్యామ్నాయాలు ఉండి ఉండవచ్చు. కానీ ఆర్ టి సి నష్టాల్లో ప్రజల లాభాలు దాగి ఉన్నాయి. ఆర్ టీ సి లో నలిగిపోవడంలో మన సర్దుబాటు ఉంది. ఇప్పుడు మన ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల్లో ఆర్ టి సి ని వదిలేసిన నిరాదరణ ఉంది. ఏరు దాటి తెప్ప తగలేసిన మన కృతఘ్నత ఉంది.

ఇవన్నీ…అల్లు అర్జున్ కు ఎవరన్నా కొంచెం చెప్పండ్రా! ఆయన్నలా వదిలేయకండ్రా!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read:

సినిమా చైతన్యం

Also Read:

నా ఫేస్…నా ఇష్టం

Also Read:

భారతీయ సంస్కృతిపై అటామిక్ బాంబు దాడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com