Russia Invasion Ukraine : రష్యా దాడితో ఉక్రెయిన్ లో భయానక వాతావరణం నెలకొంది. భూభాగంలోకి చొచ్చుకొచ్చిన సైన్యం… వైమానిక దాడులు, సముద్రమార్గం ద్వారా యుద్ద నౌకలు ఈ విధంగా రష్యా అన్ని వైపులా నుంచి ఉక్రెయిన్ ను దిగ్భంధం చేస్తోంది. రష్యా దాడుల్లో డజన్ల సంఖ్యలో ప్రజలు చనిపోయారని వార్తలు వస్తున్నాయి. రష్యా యుద్ద విమానాల బాంబుల మోతలు, హెలికాప్టర్ల రణగొణ ధ్వనులతో రాజధాని కీవ్ నగరం దద్దరిల్లుతోంది. రష్యా దాడులతో కీవ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేశారు. దీంతో భారత్ తో పాటు అనేక దేశాల ప్రజలు ఉక్రెయిన్ లో చిక్కుకుపోయారు. విద్యుత్, ఇంటర్నెట్ సరఫరా నిలిచిపోవటంతో ఉక్రెయిన్ ప్రజలకు ఎం జరుగుతోందో కూడా తెలియటం లేదు.
అయితే తమ ఆర్మీ దాడుల్లో రష్యా సైనికులు సుమారు 50 మంది చనిపోయారని ఉక్రెయిన్ ప్రకటించింది. ప్రభుత్వం దేశంలో మార్షల్ లా విధించింది. రష్యా తో దౌత్య సంబంధాలు తెగదెంపులు చేసుకున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జేలేన్స్కి ఈ రోజు చెప్పారు.
మరోవైపు ఉక్రెయిన్ మీద రష్యా దాడిని నాటో(NOrth Atlantic Treaty organization) కూటమి తీవ్రంగా ఖండించింది. నాటో తరపున రష్యా ను ఎదుర్కునేందుకు రక్షణ ప్రణాలికలు సిద్దం చేశామని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్తోల్టేన్ బర్గ్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి నాటో బలగాలను ఉక్రెయిన్ పంపటం లేదని, అవసరమైతే పంపేందుకు సిద్దం చేసినట్టు స్పష్టం చేశారు. యుద్ద క్షేత్రమైన ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలకు సమీపంలో నాటో బలగాలు మొహరిస్తామని తెలిపారు.
ఉక్రెయిన్ మీద రష్యా దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్దమని, రష్యా మీద ఆంక్షలు విధిస్తున్నట్టు యురోపియన్ యూనియన్ ప్రకటించింది. ఈ మేరకు ఈ రోజు బ్రస్సెల్స్ లో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రష్యా కు చెందిన ఆర్ధిక సంస్థలు, బ్యాంకుల లావాదేవీలను స్తంభింప చేస్తున్నట్టు ఈయు ప్రతినిధి వెల్లడించారు. దీంతో యూరోప్ లోని అన్ని దేశాల్లో రష్యా మీద ఆంక్షలు అమలులోకి వస్తాయి.
ఎలాంటి కవ్వింపు చర్యలు చేయని ఉక్రెయిన్ మీద రష్యా దాడి చేయటం దారుణమని, ఇందుకు రష్యా మూల్యం చెల్లించుకుంటుందని బ్రిటన్ ప్రధానమంత్రి బోర్రీస్ జాన్సన్ మండిపడ్డారు.
ఇంతజరుగుతున్నా రష్యా జంకుగొంకు లేని ప్రకటనలు చేస్తోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే ఉద్దేశం తమకు లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దోన్బాస్ ప్రాంతంలో శాంతి స్థాపనే తమ లక్ష్యమని పునరుద్ఘాటించారు.