Friday, September 20, 2024
HomeTrending Newsఅమెరికా, నాటో కుట్రలు ఎదుర్కొంటాం - రష్యా

అమెరికా, నాటో కుట్రలు ఎదుర్కొంటాం – రష్యా

నాటో కూటమి ఉక్రెయిన్ లో రాడార్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తోందని, తద్వారా రష్యాను అదుపులో ఉంచాలని చూస్తోందని రష్యా అధ్యక్షుడు వ్లాద్మిర్ పుతిన్  ఈ రోజు (మంగళవారం) ఆరోపించారు. నాటో కూటమి రష్యా వ్యతిరేక బావోద్వేగాలను రెచ్చగొడుతోందని, నాటో కుట్రలను ఎదుర్కొంటామని పుతిన్ తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున బలగాలను పంపిస్తున్న అమెరికా.. రష్యా గొంతు కోయాలని కుయుక్తులు పన్నుతోందని పుతిన్ మండిపడ్డారు. అయితే రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలైందనే వార్తలు కలకలం రేపుతున్నాయి. సరిహద్దుల్లో కాల్పుల మోత మొదలైంది. ఐదుగురు ఉక్రెయిన్ సైనికులను హతమార్చినట్లు రష్యా తన తాజా ప్రకటనలో వెల్లడించింది.

తమ దేశంలోకి చొరబడేందుకు ఉక్రెయిన్ విధ్వంసక, నిఘా బృందంపై కాల్పులు జరిపామని, కాల్పుల్లో ఐదుగురు మరణించారని వెల్లడించింది. తమ భూభాగంలోనే వారిని హతమార్చినట్లు రష్యా తెలిపింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సరిహద్దు దాటేందుకు జరిగిన యత్నాలను అడ్డుకున్నామని సైన్యం తెలిపింది. కాల్పుల్లో తమ సైనికులెవరూ గాయపడలేదని పేర్కొంది. ఉక్రెయిన్ సాయుధ దళాలు రెండు యుద్ధ వాహనాల్లో రష్యా భూభాగంలోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నించాయని, అడ్డుకునేందుకు కాల్పులు జరిపామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ కాల్పుల్లో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు తెలిపారు.

కాగా, రష్యా సైన్యం ప్రకటనను ఉక్రెయిన్ మిలటరీ ఖండించింది. తమ సైనికులు చొరబాటుకు ప్రయత్నించారన్న రష్యా వాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. సరిహద్దుల్లో తాము కాల్పులకు పాల్పడుతున్నామని రష్యా చేసిన ఆరోపణలను కూడా ఉక్రెయిన్ సైన్యం ఖండించింది. ఉక్రెయిన్ సైన్యం జరిపిన కాల్పుల్లో తమ సరిహద్దు సైనిక స్థావరం ధ్వంసమైందని అంతకుముందు రష్యా ఆరోపించింది. ఈ ఆరోఫణల్లో నిజం లేదని ఉక్రెయిన్ చెబుతోంది. ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు రష్యా రూపొందించిన అసత్య వార్తలని ఉక్రెయిన్ తెలిపింది. తమ సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ సెక్రటరీ డానిలోవ్ తెలిపారు. తమ సైనికులకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉండే పరిస్థితి లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పరోక్షంగా హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్